BJP: తెలంగాణ బీజేపీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) చక్రం తిప్పారా? తనకు అత్యంత సన్నిహితుడైన ఎన్. రామచందర్ రావుకు (Ramachander Rao) అధ్యక్ష పదవి రావడం వెనుక బాబు హస్తం ఉన్నదా? రాష్ట్ర బీజేపీ నేతలు అసంతృప్తి, అసహనం వెలిబుచ్చుతున్నా.. ఆఖరికి ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) రాజీనామా చేసినా ఏరికోరి మరీ రామచందర్‌కు ఇవ్వడంలో ఆంతర్యమేంటి? ఈటల రాజేందర్‌తో (Etela Rajender) పాటు పలువురు సీనియర్లు.. అందులోనూ బీసీలు ఉన్నప్పటికీ ఆయనకే ఎందుకిచ్చారు? అనే ప్రశ్నలకు చిత్రవిచిత్రాలుగా సమాధానాలు వస్తున్నాయి. ఇంతకీ చంద్రబాబు చక్రం తిప్పారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత..? పోనీ రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న మతలబు ఏమిటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.. ఇంకెందుకు ఆలస్యం చకచకా ఈ కథనం చదివేయండి మరి.
Read Also- YSRCP: వైసీపీలోకి జేసీ ఫ్యామిలీ.. అధికారిక ప్రకటన
ఇదీ అసలు కథ..
ఎన్నో వివాదాలు, అంతకుమించి హడావుడి మధ్య తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఫిక్స్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు పీవీఎన్ మాధవ్, తెలంగాణకు రామచందర్ రావును బీజేపీ పెద్దలు అధికారికంగా మాత్రమే ప్రకటించాల్సి ఉన్నది. అయితే ఏపీ విషయంలో పెద్దగా వివాదాలు లేవు కానీ.. తెలంగాణ అధ్యక్ష పదవిపైనే లేనిపోని ఆరోపణలు, విమర్శలు అంతకుమించి అసంతృప్తి నెలకొన్నది. ఎందుకంటే.. తెలంగాణలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నది. పైగా ఎప్పట్నుంచో సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి ఇవ్వాలని పెద్దలు భావించారు కానీ, చివరి నిమిషంలో రామచందర్ పేరు తెరపైకి రావడం, అంతలోనే అధికారిక ప్రకటన కూడా రావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు.. క్యాడర్ ఒక్కసారిగా కంగుతిన్నది. ఈ అసంతృప్తితోనే ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా కూడా చేసేశారు. రానున్న రోజుల్లో ఆయన బాటలో ఇంకెందరు నడుస్తారో తెలియట్లేదు. అయితే.. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. సీబీఎన్‌కు అత్యంత సన్నిహితుడు రామచందర్. ఆయన్నే ఖరారు చేయడం వెనుక ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరిపి.. పదవి వచ్చేలా చేసినట్లుగా తెలిసింది. ఈ దెబ్బతో ఈటలకు చెక్ పెట్టినట్లుగా అయ్యిందనే టాక్ నడుస్తున్నది. ఈ క్రమంలోనే రామచందర్ రావును నామినేషన్ వేయాలని ఢిల్లీ నుంచి ఫోన్లు రావడం.. రాజాసింగ్‌ను అడ్డుకోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయని తెలుస్తున్నది.
Read Also- PuriSethupathi: ‘పూరిసేతుపతి’ సినిమాకు కామ్‌గా క్లాప్.. పూరిలో ఇంత మార్పా?
అవునా.. నిజమా?
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేనతో కలిసి తెలుగుదేశం పార్టీ కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లి ఊహించని రీతిలో అధికారంలోకి వచ్చింది. ఇదే ఫార్ములాను తెలంగాణలో ప్రయోగించాలని ఇటు చంద్రబాబు.. అటు ఢిల్లీ పెద్దలు ప్లాన్ చేసినట్లుగా సమాచారం. అందుకే రానున్న తొలుత జీహెచ్‌ఎంసీ (GHMC) బరిలో కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ (BJP, Janasena, TDP) కలిసికట్టుగా పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పొత్తు కోసమే తనకు సన్నిహితుడైన రామచందర్‌ను బీజేపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక చేయించారట. కూటమిగా ముందుకు వెళ్తేనే.. ఆంధ్రాలో లాగానే తెలంగాణలో కూడా అధికారంలోకి రావొచ్చని పెద్దలు మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని పెట్టే పార్టీ బీజేపీ కాదని తేల్చి చెప్పేశారు. అధిష్టానం ఇంకా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని (Telangana BJP President) ప్రకటించలేదని.. ఎవరికి వాళ్ళు చంద్రబాబు ప్రకటించారని.. ఎవరో ఇంకొక ఆయన ప్రకటించారు అంటే కాదని సంజయ్ మండిపడ్డారు. అందరూ నామినేషన్ వేశాక ఎవరు అధ్యక్షుడిగా ఉండాలో అధిష్టానమే నిర్ణయిస్తుందని బండి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
తెరవెనుక బండి!
వాస్తవానికి తెలంగాణలో టీడీపీ లేనే లేదు. బహుశా రానున్న ఎన్నికల్లో ఒంటరిగా కూడా పోటీచేసే పరిస్థితి లేదు. ఒకప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పుడు వేరు. దీంతో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్తోందనే ప్రచారం.. రామచందర్‌కు చంద్రబాబే అధ్యక్ష పదవి ఇప్పించారనే టాక్‌తో కమలం క్యాడర్ భగ్గుమంటోంది. తెలంగాణలో జీవం లేని టీడీపీని బతికించడానికి బీజేపీ పార్టీని ప్రధాని మోదీ, అమిత్ షాలు బలి చేస్తున్నారని క్యాడర్ కన్నెర్రజేస్తున్న పరిస్థితి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈటల రాజేందర్ అధ్యక్షుడు అయితే పొత్తు కుదరదని బండి సంజయ్ ద్వారా చెక్ పెట్టినట్లుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. బండి ప్రోద్భలంతోనే కాళేశ్వరం విచారణలో ఎంపీ ఈటల పేరును సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేర్పించినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే అటు ఈటలకు చెక్ పెట్టేసి.. ఇటు టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి ముందుకెళ్తే బాగుంటుందని అధిష్టానానికి బండి సంజయ్ ప్రతిపాదించినట్లుగా తెలుస్తున్నది. తెరవెనుక చక్రం ఎవరు తిప్పారనే విషయం దీన్ని బట్టి క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. అందుకే.. రామచందర్‌కు అధ్యక్ష పదవి ఖరారు కావడంపై అటు మీడియాలో నేతలు.. ఇటు సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. చూశారుగా.. ఇందులో నిజానిజాలెంతో కేంద్ర, రాష్ట్రంలోని బీజేపీ పెద్దలకే తెలియాలి కానీ, ఎవరికి తోచినట్లుగా వాళ్లు మాత్రం తెగ ప్రకటనలు, కామెంట్స్ చేసేస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ పెద్దలు స్పందించి ఇలాంటి ప్రచారినికి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
Read Also- Kannappa: ‘గేమ్ ఛేంజర్’ బాటలో ‘కన్నప్ప’.. తలబాదుకుంటోన్న మంచు విష్ణు!