Swetcha Effect: ‘స్వేచ్ఛ’ పత్రికలో వచ్చిన కథనాల ప్రభావంతో ఎట్టకేలకు దమ్మపేట తహసీల్దార్ స్పందించారు. ప్రభుత్వ భూములను కాపాడుతామని హామీ ఇచ్చారు. అయితే, గతంలో మాదిరిగానే నామమాత్రపు చర్యలు తీసుకుంటారా, లేదా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారి నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి.
ప్రభుత్వ భూముల రక్షణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలోని ముష్టిబండ ప్రభుత్వ భూములను స్థానిక రెవెన్యూ శాఖ పరిరక్షించే దిశగా అడుగులు వేస్తుంది. మంత్రి అనుచరులు ఉన్నా తగ్గేది లేదంటూ యంత్రాంగం కదులుతుంది. సర్వే నంబర్ 114లో ఉన్న సుమారు 2000 ఎకరాల సర్కారు భూములను స్వాధీనం చేసుకుని, ఆక్రమణదారులను ఖాళీ చేయించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని తహసీల్దార్ భగవాన్ రెడ్డి తేల్చి చెప్పడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కబ్జాదారులకు ఏ మంత్రి అండదండలు ఉన్నాయో మాత్రం తెలియాల్సి ఉంది. ముష్టిబండ రెవెన్యూ పరిధిలోని 114 సర్వే నంబర్‌లో ఉన్న 2000 ఎకరాల భూమిలో కేవలం 600 ఎకరాలు మాత్రమే అసైన్‌మెంట్ భూమి అని గతంలో కొందరు అధికారులు గుర్తించారని తహసీల్దార్ పేర్కొన్నారు. ఇటువంటి భూముల్లో కబ్జా చేసిన బడా బాబులపై కేసులు నమోదు చేశామని, త్వరలో ఈ భూములను కబ్జాకోరుల చెర నుండి విముక్తి కలిగిస్తామని తహసీల్దార్ తెలిపారు. ఎమ్మార్వో మాటలను గ్రామస్తులు పూర్తిగా నమ్మకపోయినప్పటికీ, ఆయన చెప్పిన మాటలకు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తగ్గేది లేదు: తహసీల్దార్
దమ్మపేట మండలంలోని ముష్టిబండ రెవెన్యూ పరిధిలో 114 సర్వే నంబర్‌లో ఉన్న 2000 ఎకరాల భూమిలో, 600 ఎకరాలు మాత్రమే రెవెన్యూకు సంబంధించిన భూమి అని తహసీల్దార్ భగవాన్ రెడ్డి తెలిపారు. ముష్టిబండ గ్రామం ఏజెన్సీ పరిధిలోకి వస్తుందని, ఈ ప్రాంతంలో ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వారు వ్యవసాయం కొనసాగించుకుంటే వారిపై ఎలాంటి చర్యలు ఉండవని అన్నారు. అయితే, గిరిజనేతరులు అట్టి భూములను స్వాధీనం చేసుకొని వ్యవసాయ భూములుగా మార్చేందుకు ప్రయత్నం చేశారని తమ దృష్టికి వచ్చిందని, వాటిని స్వాధీనం చేసుకోవడానికి కొంత సమయం కావాలని, ఇప్పటి నుంచి ఆ భూములపై నిఘా పెట్టడం జరిగిందని చెప్పారు. ఆక్రమణదారులు ఎవరున్నా ఉపేక్షించేది లేదంటూ తేల్చి చెప్పడంపై గిరిజన సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also- Aishwarya Rajesh: నలుగురు కాదు.. ఆరుగురు అయినా చేస్తా..!
గ్రామస్తుల హర్షం
మండలంలోని ప్రభుత్వ భూములు, చెరువులు సైతం కబ్జాకోరుల చేతిలో చిక్కుకొని కనుమరుగయ్యే దశలో ఉన్నాయని, వీటిని కాపాడేందుకు రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోవడం దమ్మపేట మండల ప్రజలు చేసుకున్న అదృష్టమని గ్రామస్తులు భావిస్తున్నారు. ఎంతోమంది అధికారులు ఇప్పటివరకు తహసీల్దార్ విధులు నిర్వహించినప్పటికీ ప్రభుత్వ భూములను కాపాడే దిశగా ప్రయత్నం చేయలేదని, తెలంగాణ పత్రికలో కథనాలకు అధికార యంత్రాంగంలో కదలికలు వచ్చినట్లు తెలుస్తుందని వారు అన్నారు. ప్రస్తుతం ముష్టిబండ రెవెన్యూ పరిధిలోని 114 సర్వే నంబర్‌పై దృష్టి పెట్టడం, అలాగే మండలంలోని మరికొన్ని సర్వే నంబర్లపై కూడా దృష్టి పెడితే ప్రభుత్వ భూమి సెంటు కూడా కబ్జా గురి కాకుండా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి అధికారులు పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా పై స్థాయి అధికారులు సైతం వీరికి సహకారాలు అందిస్తే, మంత్రి అనుచరులని తేడా లేకుండా సర్కార్ భూములను కాపాడాలని దమ్మపేట మండల ప్రజలు కోరుకుంటున్నారు.
Read Also- Siva Shakthi Datta: 16 ఏళ్లు ఇండస్ట్రీ వదిలేసి.. శివ శక్తి దత్తా గురించి ఈ విషయం తెలుసా?