Mowgli Teaser: ‘బబుల్ గమ్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో రోషన్ కనకాల (Roshan Kanakala) తన సెకండ్ మూవీ ‘మోగ్లీ 2025’ (Mowgli 2025)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఫైనల్‌గా ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. జాతీయ అవార్డు గ్రహీత, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ (Sandeep Raj) దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మోగ్లీ 2025’ అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, బుధవారం (నవంబర్ 12) యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) చేతుల మీదుగా చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఈ సినిమాపై ఉన్న బజ్‌ను మరింతగా పెంచేలా.. సోషల్ మీడియాలో దూసుకెళుతోంది.
Also Read- SSMB29: ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఆమె పాత్ర పేరేంటో తెలుసా?
రాముడు, సీత, రావణుడు
టీజర్‌ను గమనిస్తే.. దట్టమైన అడవిలో గుర్రంపై హీరో వస్తున్నట్లుగా టీజర్ మొదలైంది. హనుమాన్‌పై భక్తి గీతం ప్లే అవుతుండగా, హీరో వర్కవుట్స్ చేస్తున్నారు. హాయిగా, సంతోషంగా జీవితాన్ని గడపాలనుకునే యువకుడిగా మోగ్లీని పరిచయం చేశారు. అలాంటి మోగ్లీ.. ఓ అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడటం, ప్రేమలో పడిన తర్వాత అతని ప్రపంచం అనేక మలుపులు తిరుగుతున్నట్లుగా ఈ టీజర్ తెలియజేస్తుంది. రామ–సీతల ప్రేమకథలా వీరిద్దరి ప్రేమ కూడా అందంగా ఉంటుందనే అనుకుంటున్న సమయంలో, రాక్షసుడు వంటి పోలీస్ ఆఫీసర్ ఎంటరౌతాడు. దీంతో అంతా యుద్ధ భూమిగా మారుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనేదే మెయిన్ కథ. దర్శకుడు సందీప్ రాజ్ టీజర్‌ను కట్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. రామ–సీత లాగా హీరో–హీరోయిన్లు.. రావణుడిలా విలన్‌ను చూపుతూ ఆధునిక రామాయణాన్ని ప్రజెంట్ చేశారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, 2025 వంటివి ఎందుకనేది? ఈ టీజర్‌లో అంతగా తెలియనివ్వలేదు. 2025 అని టైటిల్‌లో వేయడానికి కారణం, ఇది ఇప్పటి రామాయణం అని చెప్పాలనేది ఉద్దేశ్యమై ఉండొచ్చు.
Also Read- Kaantha Controversy: ‘కాంత’.. ఎవరి తాత, నాన్నల కథ కాదు.. కాంట్రవర్సీపై రానా, దుల్కర్ క్లారిటీ!
ఇద్దరి కెమిస్ట్రీ అదుర్స్..
మొదటి సినిమాతోనే తనేంటో నిరూపించుకున్న రోషన్ కనకాల.. ఇందులో ఇంకాస్త పరిణితి ప్రదర్శించాడు. చాలా బలమైన కథను ఆయన మోస్తున్నట్లుగా ఈ టీజర్ తెలియజేస్తుంది. తన పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని.. కొత్త లుక్‌తో, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగులు కూడా చాలా సహజంగా ఉన్నాయి. అతనికి జోడీగా నటించిన సాక్షి మదోల్కర్ (Sakkshi Mhadolkar) చెవిటి–మూగ అమ్మాయిగా నేచురల్‌గా నటించింది. ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకుల మనసు తాకింది. ఇక విలన్‌గా బండి సరోజ్ కుమార్ ఇంటెన్స్‌గా కనిపించగా, హీరో స్నేహితుడి పాత్రలో వైవా హర్ష తన కూల్ హ్యుమర్‌తో అలరించాడు. సాంకేతికంగా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉందనే విషయం ప్రతి ఫ్రేమ్ తెలియజేస్తుంది. డిసెంబర్ 12న రిలీజ్‌కు వస్తున్న ఈ చిత్రం ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో వెయిట్ అండ్ సీ..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
