Raasi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, చరణ్ కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ కేవలం బాక్సాఫీస్ విజయం సాధించడమే కాక, చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ముఖ్యంగా, అనసూయ ఆడిపాడిన రంగమ్మత్త పాత్ర సినీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆమెకు ఇండస్ట్రీలో కొత్త అవకాశాల వరంగల్లా మారింది. అయితే, ఈ రంగమ్మత్త పాత్రకు ముందుగా రాశి ఖన్నాను సంప్రదించారని, ఆమె ఆ పాత్రను తిరస్కరించారని గతంలో వార్తలు వచ్చాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశి ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ, ఆ పాత్రను ఎందుకు వదులుకున్నదో వివరించింది. రాశి మాట్లాడుతూ, “ రంగమ్మత్త పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ గారు నన్ను సంప్రదించారు. కథ, పాత్ర, సన్నివేశాల గురించి వివరంగా చెప్పారు. అప్పట్లో నేను కాస్త లావుగా ఉన్నాను. పాత్రలో డ్రింకింగ్ సీన్, స్నానం చేస్తూ మాట్లాడే సీన్స్ , చరణ్‌తో బోట్ సన్నివేశం లాంటివి ఉన్నాయి. ఇవి నాకు సరిపడవనిపించాయి. ఒక తల్లిగా ఆ పాత్ర నాకు మంచిది కాదని అనిపించింది. ఇక అదే విషయాన్ని సుకుమార్ గారికి చెప్పి, ఆ పాత్రను నేను వదులుకున్నాను. అనసూయ ఆ పాత్రకి ప్రాణం పోసింది. చాలా బాగా నటించింది. ఆ పాత్ర మిస్ అయినందుకు నేను ఎక్కువ బాధపడలేదు,” అని ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది.