Vishwak Sen Funky: విభిన్న కథా చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Mass Ka Das Vishwak Sen), హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ (Director KV Anudeep) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఫంకీ’ (Funky). విశ్వక్ సేన్ తన జానర్ మార్చి చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఆ ఉత్సాహంలో ఉన్న టీమ్.. ఈ నవ్వుల తుఫానును 2026 ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల (Funky Release Date) చేయబోతున్నట్లుగా తెలుపుతూ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. టీజర్‌తో వినోదాల విందుకి హామీ ఇచ్చిన ఈ సినిమాపై ఇప్పటికే తారాస్థాయిలో అంచనాలున్నాయి. అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంటర్‌టైనర్స్‌లో ఒకటిగా ‘ఫంకీ’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్
ఈ సినిమా కోసం స్వచ్ఛమైన వినోదాన్ని అందిస్తూ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి అద్భుతమైన టీమ్ ఒకచోటకు చేరింది. దర్శకుడు కె.వి. అనుదీప్ తన శైలి కామెడీ విందుతో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులకు కావాల్సిన బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్ అన్నట్లుగా ఇప్పటికే టీమ్ నుంచి వార్తలు అందుతున్నాయి. అనుదీప్ దర్శకత్వం అంటే.. వినోదం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనాలు సృష్టించిన అనుదీప్.. ఈ మధ్య ప్రతి సినిమా ఫంక్షన్‌లో కనిపిస్తూ.. తన స్థాయి ఏంటో తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పుడీ దర్శకుడు మరోసారి విభిన్నమైన కథాంశం, కట్టిపడేసే హాస్యంతో ప్రేక్షకుల మనసు దోచుకునే పనిలో ఉన్నారు.
Also Read- Bandla Ganesh: బండ్ల గణేష్ మాటల వెనుకున్న మర్మమేంటి? ఎందుకిలా మాట్లాడుతున్నాడు?
యువత మనసు దోచుకునేలా..
ఇక ఇటీవల వచ్చిన టీజర్‌ను గమనిస్తే.. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సినీ దర్శకుడి పాత్రను పోషిస్తున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. న్యూ లుక్, న్యూ యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను సరికొత్తగా అలరించనున్నారనేది అర్థమవుతోంది. టీజర్‌లో ఆయన నటన, ఎనర్జీ, కామెడీ టైమింగ్‌కి అందరినీ ఆకర్షించింది. ఈ సినిమాలో కయాదు లోహర్ (Kayadu Lohar) తన అందంతో కట్టిపడేస్తోంది. తెరపై విశ్వక్-కయాదు జోడి కొత్తగా, అందంగా కనిపిస్తూ.. యువత మనసు దోచుకుంటోంది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీజర్‌తో ఏర్పడిన అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఫంకీ’ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
