Vishnu Vinyasam: టాలీవుడ్‌లో కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పేరున్న హీరో శ్రీ విష్ణు (Sree Vishnu). ప్రస్తుతం ఆయన ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) అనే యూనిక్ ప్రాజెక్ట్‌తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతి రావు (Yadunaath Maruthi Rao) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు. హేమ, షాలిని సమర్పిస్తున్న ఈ చిత్రానికి సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామచారి ఎం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీమ్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘దేఖో విష్ణు విన్యాసం’ (Dekho Vishnu Vinyasam) అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read- Love Letters: బ్యాచ్‌లర్స్ ప్రదీప్, సుడిగాలి సుధీర్‌కు ప్రేమలేఖలు.. ఆ లేఖల్లో ఏముందంటే?
కనిపెట్టిందే వీడి కోసం
ఈ పాటను గమనిస్తే.. అసలీ సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుంచే ఇది జ్యోతిష్యం బేస్డ్ సినిమా అనే క్లారిటీని మేకర్స్ ఇచ్చారు. ఇప్పుడీ సాంగ్‌ని కూడా దానికే లింక్ చేస్తూ స్టార్ట్ చేశారు. ఈ సరదా పాట హీరో శ్రీ విష్ణుకి జ్యోతిష్యంపై ఉన్న పిచ్చిని తెలియజేస్తుంది. ప్రతి బీట్, ప్రతి పదం, ప్రతి ఎక్స్‌ప్రెషన్ విష్ణు పాత్ర జాతకాలను.. జీవితానికి మార్గదర్శకంగా ఎలా భావిస్తుందో తెలియజేస్తోంది. రధన్ అందించిన స్వరాలు, రామజోగయ్య శాస్త్రి చమత్కారమైన సాహిత్యం, శ్రీకృష్ణ పవర్ ఫుల్ వోకల్స్.. ఈ పాటను మూఢనమ్మకాలపై ఒక సరదా సాంగ్‌గా చిత్రీకరించాయని చెప్పుకోవచ్చు. ఈ పాట మొదలవ్వడమే.. ‘ఒక గాలి, ఒక ధూళి, ఒక దిష్టి, ఒక నరదిష్టి లేకుండా పది కాలాలు సంతోషంగా ఉండాలా.. వారి కుటుంబాలు చల్లగుండాలా..’ అంటూ జ్యోతిష్యం చెబుతున్నట్లుగా మొదలైన ఈ పాట.. ‘దేఖో విష్ణు విన్యాసం, వీడి విచిత్ర విన్యాసం, వాస్తు న్యూమరాలజి, ఆస్ట్రాలజీలు కనిపెట్టిందే వీడి కోసం’ అంటూ పాట యమా హుషారుగా మొదలైంది. శ్రీ విష్ణు డ్యాన్స్ మూమెంట్స్ కూడా వావ్ అనేలా ఉన్నాయి. పాట విన్న విన్న తర్వాత అందరూ ఇలా కూడా పాట ఉంటుందా? అని ఆశ్చర్యపోక మానరు. ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్ అవడమే కాకుండా.. సినిమా మాంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తుంది.
Also Read- Sobhita Dhulipala: ‘చీకటిలో’ శోభిత ధూళిపాల ఏం చేస్తుందో.. ఆ ఓటీటీలో చూడండి!
ఫిబ్రవరిలో విడుదల
శ్రీ విష్ణు సరసన నయన సారిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, గోపరాజు రమణ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ఎ. రమణాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్, కార్తికేయన్ రోహిణి ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను ఫిబ్రవరిలో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

