Makutam: వెర్సటైల్ హీరోగా పేరు పొందిన విశాల్‌పై ఈ మధ్య ఎలాంటి వార్తలు వచ్చాయో తెలియంది కాదు. ఆయన హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. వార్తలు రావడం అనే కాదు, ఆయన కూడా ఓ సినిమా వేదికపై గజ గజ వణికిపోతూ, తీవ్ర వ్యాధితో బాధపడుతున్నట్లుగా కనిపించారు. అంతే, అప్పటి నుంచి ఆయనపై రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. కాకపోతే ఆ వైరల్ వార్తలకు వెంటనే బ్రేక్ వేసిన విశాల్, వెంటనే తన పెళ్లి మ్యాటర్‌ను లైన్‌లో పెట్టి, హెల్త్ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక ఆయన నటించిన ‘మద గజ రాజా’ చిత్రం పూర్తయ్యి చాలా కాలం అవుతున్నా విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా చాలా సంవత్సరాల తర్వాత విడుదలై, తమిళ్‌లో ఘన విజయం సాధించింది. ఈ హుషారులో విశాల్ కూడా కోలుకున్నాడు. తన ప్రేమని బయటపెట్టి, కాబోయే భార్యని అందరికీ పరిచయం చేశారు. అంతే, అప్పటి నుంచి ఏదో రకంగా ఆయన వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన నటించబోతున్న సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే.
సూపర్ గుడ్ ఫిల్మ్ 99వ చిత్రంగా చేయబోతున్న సినిమాలో హీరోగా విశాల్ (Hero Vishal) నటించబోతున్నారు. ఇది విశాల్‌కు 35వ సినిమా (Vishal 35th film) కావడం మరో విశేషం. ఇందులో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు కూడా. సినిమా ప్రకటన వచ్చిందో, లేదో.. వెంటనే టైటిల్ కూడా మేకర్స్ ప్రకటించేశారు. రవి అరసు దర్శకత్వంలో ఆర్ బి చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘మకుటం’ (Makutam movie) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. టైటిల్ టీజర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమాకు సంబంధించి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని.. శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. ఇందులో విశాల్ ఒకటి కాదు, రెండు కాదు.. త్రిపాత్రాభినయం చేస్తున్నాడా? అనేలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read- Maaman OTT: మేనల్లుడిపై మేనమామ చూపే ప్రేమ.. భార్యకు నచ్చకపోతే! ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా!
సముద్రం బ్యాక్ డ్రాప్ మాఫియా కథగా రాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఈ లుక్‌ని గమనిస్తే.. విశాల్ యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా కనిపిస్తున్నారు. మూడు ఢిపరెంట్ లుక్స్, షేడ్స్‌లో వచ్చిన ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ తర్వాత, మరోసారి విశాల్ ఏదో ప్రయోగం చేయబోతున్నాడనేలా అంతా మాట్లాడుకుంటుండటం విశేషం. ఈ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా, దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు