Balasaraswathi Devi: తెలుగు సినిమా తొలితరం నేపథ్య గాయని, ప్రముఖ నటి (Indian singer and actress) రావు బాల సరస్వతి దేవి (97) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బుధవారం (అక్టోబర్ 15, 2025) హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. 1928, ఆగస్టు 29న జన్మించిన రావు బాల సరస్వతి దేవి (Raavu Balasaraswathi Devi), ఆరేళ్ల వయసు నుంచే సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. తన మధుర గానంతో ‘లలిత సంగీత సామ్రాజ్ఞి’గా తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా తెలుగు వారికి పరిచయమైన ఆమె, 1939లో విడుదలైన ‘సతీ అనసూయ’ చిత్రంలో తొలి పాటను ఆలపించి తెలుగులో మొట్టమొదటి నేపథ్య గాయనిగా చరిత్ర సృష్టించారు.
దక్షిణాది తొలి నేపథ్య గాయని
తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో 2000కు పైగా పాటలు పాడారు. ‘‘చెంచు లక్ష్మి, లైలా మజ్ను, షావుకారు, స్వప్న సుందరి, దేవదాసు, పెళ్ళిసందడి’’ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె ఆలపించిన గీతాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. తన కెరీర్ ఆరంభంలో నటిగా కూడా పలు చిత్రాలలో నటించారు. దక్షిణాదిలో తొలి నేపథ్య గాయనిగానే కాకుండా.. లలిత సంగీతాన్ని తెలుగు సినిమాకు పరిచయం ఘనత కూడా ఆమె సంపాదించారు. అలాగే, తొలి తెలుగు సోలో గ్రామ్‌ఫోన్ రికార్డు కూడా ఆమెదే కావడం విశేషం. వివాహం అనంతరం కొంతకాలం పాటు పాటలు పాడటం మానేసిన రావు బాల సరస్వతి దేవి, తన భర్త మరణానంతరం మళ్లీ పాటలు పాడటం స్టార్ట్ చేశారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.
రావు బాలసరస్వతి ఆత్మకు శాంతి చేకూరాలి
‘‘తొలి తరం గాయని, నటి శ్రీమతి రావు బాల సరస్వతి కన్నుమూశారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎనిమిది దశాబ్దాల కిందటే తెలుగు, తమిళ చలన చిత్రాల్లో నటించిన శ్రీమతి బాలసరస్వతి గాయనిగానూ తన గాత్రాన్ని ప్రేక్షకులకు వినిపించారు. లలిత సంగీతంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, ఆకాశవాణిలో ఎన్నో గీతాలు ఆలపించారు. శ్రీమతి బాల సరస్వతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అని అన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. సీనియర్ నటుడు బాలకృష్ణ కూడా బాల సరస్వతి దేవి మృతి కలచివేసిందని తెలుపుతూ, ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
