Venu Udugula: కళను గౌరవించడంలో మనం ఎక్కడో విఫలమవుతున్నాం? పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారం పొందిన కళాకారుడికి ఇచ్చే మర్యాద ఇదేనా? – ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రశ్నలు మారుమోగుతున్నాయి. అరుదైన ‘మెట్ల కిన్నెర’ వాయిద్య కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగిలయ్య (Darshanam Mogilaiah)కు జరిగిన అవమానంపై టాలీవుడ్ విలక్షణ దర్శకుడు వేణు ఊడుగుల (Venu Udugula) ఎమోషనల్‌గా స్పందించారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మన సాంస్కృతిక స్పృహ ఎక్కడ?
హైదరాబాద్ నగరంలోని ఒక గోడపై ఉన్న పద్మశ్రీ మొగిలయ్య చిత్రపటంపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. తన చిత్రం కనిపించకుండా అంటించిన ఆ పోస్టర్లను, స్వయంగా మొగిలయ్యే తన చేతులతో చించేస్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై స్పందిస్తూ వేణు ఊడుగుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పద్మశ్రీ పొందిన ముఖం కూడా మనలో కొందరికి ఖాళీ గోడలా కనిపిస్తే, ఇది కేవలం ఆ వ్యక్తికి జరిగిన అవమానం మాత్రమే కాదు. మన సాంస్కృతిక స్పృహ (Cultural Consciousness) ఎక్కడో బలహీనపడుతోందని చెప్పే నిశ్శబ్ద సంకేతం’’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read- Sreeleela: స్నానం చేస్తున్నట్లుగా ఏఐ పిక్స్ వైరల్.. శ్రీలీల సంచలన పోస్ట్!
నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం
మొగిలయ్య తన బొమ్మపై ఉన్న పోస్టర్లను తానే తొలగించుకుంటున్న ఆ సందర్భం చూస్తుంటే చాలా విచారకరంగా ఉందని వేణు ఊడుగుల అన్నారు. ‘‘నిజానికి ఇది ఎవరి మీదో చేస్తున్న ఆరోపణ కాదు. మన సమాజంలోని నిర్లక్ష్యానికి, కళల పట్ల మనకున్న ఉదాసీనతకు ఇది నిలువెత్తు సాక్ష్యం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక గొప్ప కళాకారుడికి తన ఉనికిని తాను కాపాడుకోవాల్సిన పరిస్థితి రావడం మన వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read- KK Passes Away: టాలీవుడ్‌లో విషాదం.. నాగార్జున ‘కేడి’ సినిమా దర్శకుడు కన్నుమూత..
ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి
ఈ ఘటనను కేవలం ఒక చిన్న విషయంగా వదిలేయకుండా, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వేణు ఊడుగుల కోరారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ అధికారులను తన పోస్ట్‌లో ట్యాగ్ చేశారు. నగరంలోని గోడలపై ఉన్న కళాఖండాలను, ముఖ్యంగా దేశ అత్యున్నత పురస్కార గ్రహీతల చిత్రాలను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన గుర్తు చేశారు. ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో విశేష గుర్తింపు పొందిన మొగిలయ్య, అంతకు ముందే అంతరించిపోతున్న కిన్నెర కళను కాపాడుతున్న యోధుడిగా పద్మశ్రీని అందుకున్నారు. అటువంటి కళాకారుడికి నేడు ఎదురైన ఈ పరిస్థితి చూసి కళాభిమానులు కలత చెందుతున్నారు. వేణు ఊడుగుల చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం, ప్రజలు కలిసి మన సంస్కృతిని, కళాకారులను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఈ పోస్ట్ తెలియజేస్తుంది.
పద్మశ్రీ పొందిన ముఖం కూడా మనలో కొందరికి
ఖాళీ గోడలా కనిపిస్తే, ఇది అవమానం కాదు.
మన cultural consciousness ఎక్కడో బలహీనపడుతోందని చెప్పే నిశ్శబ్ద సంకేతం.
మొగిలయ్య గారు తన బొమ్మపై అంటించిన పోస్టర్లను తానే తొలగించుకుంటున్న ఆ సందర్భం
చాలా విచారకరం. నిజానికి ఇది ఎవరి మీద ఆరోపణ కాదు.… pic.twitter.com/eCnJ8Jz9xb— v e n u u d u g u l a (@venuudugulafilm) December 17, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

