Sreeleela: టాలీవుడ్ డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో సెలబ్రిటీల ముఖాలను ఏఐ సాయంతో అసభ్యకరంగా మారుస్తున్న ‘డీప్ ఫేక్’ ఉదంతాలపై ఆమె ఘాటుగా స్పందించారు. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను ఇకనైనా ఆపాలని ఆమె నెటిజన్లను కోరారు. తాజాగా ఆమె స్నానం చేసి వస్తున్నట్లుగా కొన్ని డీప్ ఫేక్ (deepfake controversy) ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ఆమె దృష్టికి చేరడంతో.. సోషల్ మీడియా వేదికగా శ్రీలీల ఓ సంచలన పోస్ట్ చేశారు. అందులో..
జీవితాలను సంక్లిష్టం చేయకండి
సాంకేతికత అనేది మనిషి జీవితాన్ని సులభతరం చేయడానికి పుట్టిందని, కానీ అది ఒకరి జీవితాన్ని నరకంగా మార్చడానికి కాదని శ్రీలీల పేర్కొన్నారు. ‘‘సాంకేతికతను ఉపయోగించుకోవడానికి, దుర్వినియోగం చేయడానికి మధ్య చాలా సన్నని గీత ఉంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అనేది మనకు సాయపడాలి కానీ, మన మనశ్శాంతిని దెబ్బతీయకూడదు’’ అని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రతి అమ్మాయి ఒకరి కూతురే..
నటీమణుల కంటే ముందు తాము కూడా సాధారణ మహిళలమేనని గుర్తు చేస్తూ ఆమె ఒక భావోద్వేగపూరితమైన విన్నపం చేశారు. ‘‘ప్రతి అమ్మాయి వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ఆమె ఒకరికి కూతురు, సోదరి లేదా స్నేహితురాలు. కళను వృత్తిగా ఎంచుకున్నంత మాత్రాన వారిని ఎలాగైనా చిత్రీకరించవచ్చని అనుకోవడం తప్పు. మేము ఒక సురక్షితమైన వాతావరణంలో పని చేయాలని కోరుకుంటున్నాము’’ అని శ్రీలీల రాసుకొచ్చారు.
తోటి నటీమణుల తరపున గళం
తన పని ఒత్తిడి వల్ల ఈ పరిణామాలను ఆలస్యంగా గమనించానని, తన శ్రేయోభిలాషులు చెప్పాక ఈ విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యానని ఆమె తెలిపారు. ఇది కేవలం తన సమస్య మాత్రమే కాదని, తన తోటి నటీమణులు కూడా ఇలాంటి వికృత చేష్టల వల్ల ఇబ్బంది పడుతున్నారని, అందుకే అందరి తరపున తాను స్పందిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు.
రంగంలోకి అధికారులు
ఈ వ్యవహారాన్ని తాను తేలికగా వదిలిపెట్టడం లేదని, ఇప్పటికే అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లానని శ్రీలీల వెల్లడించారు. ‘‘అధికారులు దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటారు. మా ప్రేక్షకులు, అభిమానులు ఈ విషయంలో మాకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను’’ అని ఆమె కోరారు. శ్రీలీల చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో కూడా భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రష్మిక మందన్నా (Rashmika Mandanna) వంటి తారలు డీప్ ఫేక్ వీడియోలపై పోరాటం చేయగా, ఇప్పుడు శ్రీలీల కూడా ధైర్యంగా ముందుకు రావడం అభినందించాల్సిన విషయం. ఇలాంటి AI వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చట్టాలు తీసుకురావాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
— Sreeleela (@sreeleela14) December 17, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

