KK Passes Away: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. విలక్షణమైన మేకింగ్ స్టైల్‌తో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కిరణ్ కుమార్ (కె.కె.) కన్నుమూశారు. కిరణ్ కుమార్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే సినిమా ‘కేడి’. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ద్వారా కిరణ్ కుమార్ తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నారు. కథను నడిపించే తీరు, టేకింగ్ విషయంలో ఆయన చూపించిన వైవిధ్యం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ముగిసిన ‘KJQ’ షూటింగ్..
కిరణ్ కుమార్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం #KJQ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉంది. సినిమా అవుట్‌పుట్ విషయంలో ఆయన ఎంతో నమ్మకంతో ఉన్నారని, త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలచివేస్తోంది.
కష్టపడి తీసిన సినిమా వెండితెరపై ఎలా ఉంటుందో చూసుకోకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లడం అత్యంత బాధాకరం. ఆయన పడిన శ్రమ, సినిమాపై ఆయనకున్న నిబద్ధత ‘KJQ’ రూపంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. కిరణ్ కుమార్ మరణవార్త తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. “ఒక ప్రతిభావంతుడైన దర్శకుడిని కోల్పోవడం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలి” అంటూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, తెలుగు చిత్ర పరిశ్రమ ఒక మంచి టెక్నీషియన్‌ను కోల్పోయిందని పలువురు నివాళులర్పించారు.

