Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. సినీ కార్మికులు తమ వేతనం 30 శాతం పెంచాల్సిందేనని, షూటింగ్స్ బంద్ చేసి మరీ డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో పెంచుతామని చెబుతున్నారు కానీ, ఇంత వరకు జరగలేదు. ఈసారి పెంచితేనే షూటింగ్స్‌కు హాజరవుతామంటూ సినీ కార్మికులు (Film Employees) భీష్మించుకు కూర్చున్నారు. మరోవైపు ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చిన్న నిర్మాతలు భరించలేని స్థాయిలో వేతనాలు పెంపును యూనియన్స్ డిమాండ్ చేయటం చిన్న నిర్మాతలకు ఆమోదయోగ్యం కాదు, ఆ పెంపు వారు భరించే స్థాయిలో లేరు. ప్రతి చిన్న నిర్మాత ఈ పెంపుదలకు వ్యతిరేకంగా ఉండడం గమనార్హం. అందువలన ప్రస్తుత పరిస్థితులలో భరించలేని ఈ పెంపును నిర్మాతలందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించడమైనది’ అంటూ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా ఓ లేఖను విడుదల చేసింది. ఇప్పుడీ పంచాయితీ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దగ్గరకు చేరింది.
ఆల్రెడీ నిర్మాతలు ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే.. ‘ఎవరైనా ఔత్సాహిక నిపుణులు, కార్మికులు సినీ రంగంలో పనిచేయాలంటే వారితో పని చేయించుకోవడానికి నిర్మాతలందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగినది. లక్షలాది రూపాయలు సభ్యత్వం కొరకు కట్టవలసిన పని లేదు. నైపుణ్యం ఉన్న కార్మికునికి పని కల్పించడమే మా ధ్యేయం’ అంటూ వారి మనసులోని మాటను చెప్పేశారు. అంతేకాదు.. ఔత్సాహిక నిపుణులు, కార్మికులకు పిలుపునిస్తూ.. ఓ లేఖను కూడా అధికారికంగా విడుదల చేశారు. దీంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. మమ్మల్ని కాదని వేరే వాళ్లని తెచ్చి ఎలా షూటింగ్స్ చేస్తారో చూస్తామంటూ సినీ కార్మికుల యూనియన్ పెద్దలు తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవితో నిర్మాతల భేటీ విశిష్టతను సంతరించుకుంది.
Also Read- Mass Jathara: ‘ఓలే ఓలే’.. రవితేజ-శ్రీలీల డ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు చాలవ్!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి పెద్దగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మంగళవారం చిరంజీవిని కలిసిన కొందరు నిర్మాతలు సినీ కార్మికుల బంద్ విషయం, వారి డిమాండ్లను చిరంజీవికి వివరించినట్లుగా తెలుస్తోంది. కార్మికుల డిమాండ్ చేస్తున్న వేతన పెంపు, దీనికి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాలు చిరంజీవికి వివరించామని తాజాగా నిర్మాత సి. కళ్యాణ్ అన్నారు. చిరంజీవి ఇంట్లో గిల్డ్ సభ్యుల సమావేశం ముగిసిన అనంతరం సి కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాతలందరూ మెగాస్టార్‌ని కలిసి సమస్యలు చెప్పాము. షూటింగ్స్ సడెన్‌గా ఆపడం భావ్యం కాదని, మీ సమస్యలు చెప్పారు.. అటు వైపు కార్మికుల వెర్షన్‌ను కూడా తెలుసుకుంటాను అని చిరంజీవి చెప్పినట్లుగా సి కళ్యాణ్ (C Kalyan) తెలిపారు. రెండు మూడు రోజులు చూస్తాను.. పరిస్థితి చక్కబడకపోతే అప్పుడు నేను జోక్యం చేసుకుంటానని చిరంజీవి హామీ ఇచ్చినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ రద్దు అధ్యక్షుడు వల్లభనేని అనిల్ (Vallabhaneni Anil) మాట్లాడుతూ.. సినీ కార్మికులు సమాన హక్కులు కోరుతున్నారని, పరిశ్రమలో నైపుణ్యం ఉన్నవారిని పక్కన పెట్టి, వేరేవారిని తీసుకురావడం సరికాదని అన్నారు. వేతనాలు పెంచమని అడిగితే కొత్తవారిని తీసుకువస్తామని నిర్మాతలు చెబుతున్నారని, సినిమాపై ఇంట్రెస్ట్‌తో ఎవరైనా వస్తే వారి శ్రమను దోపిడి చేస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం ఇప్పటి వరకు చర్చలతోనే పరిష్కారమవుతుందని ఆశిస్తూ వచ్చాం.. కాదంటే ఉద్యమ మార్గాన్ని కూడా ఎంచుకుంటామని ఆయన హెచ్చరించారు.
Also Read- Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజున ‘కట్టప్ప’ ఇచ్చే ట్రీట్ ఇదే..
ఇదే ట్విస్ట్
సినీ కార్మికుల ఆందోళనపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy) స్పందించారు. కార్మికుల జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. అది తక్షణమే జరిగి తీరాలి. హైదరాబాద్‌లో బతకాలంటే జీతాలు పెరగాలి. ప్రస్తుతం నేను ఢిల్లీ పర్యటనలో ఉన్నాను. పర్యటన ముగిసిన అనంతరం నేను కార్మికులతో మాట్లాడతాను. ప్రస్తుతం ఈ అంశాలన్నింటిని కూడా నిర్మాత, ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజుకు అప్పగించాము. ఆయనే నిర్మాతలు, కార్మికులతో చర్చిస్తున్నారు. ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.. అలాగే టికెట్ల ధరలు పెంచుకునేందుకు కూడా మేము అనుమతులు ఇస్తున్నాం. కాబట్టి.. కార్మికులు అడుగుతున్న డిమాండ్లపై చర్చించి, వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను.. అని కోమటిరెడ్డి వివరించారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ‘మా’ ఎన్నికల సమయంలో అంతా ఎలా అయితే మాట్లాడుకున్నారో.. ఇప్పుడు కూడా దాదాపు టాలీవుడ్ గురించి అంతా అలాగే మాట్లాడుకుంటున్నారు. చూద్దాం.. ఈ విషయం ఎలా పరిష్కారమవుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు