Tollywood Producers: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంతమంది నిర్మాతలు (Tollywood Producers) అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి మరోసారి ఇండస్ట్రీ పరువును పోగొట్టింది. నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) వంటి స్టార్ హీరో నటించిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam) చిత్రం విడుదల ఇంకో గంటలో అనగా నిలిచిపోవడం.. నిర్మాణ సంస్థల వృత్తిపరమైన వైఫల్యాన్ని వేలెత్తి చూపిస్తోంది. పాత బకాయిల వివాదం కోర్టు దాకా వెళ్లడం, చివరికి న్యాయపరమైన అడ్డంకి వల్ల సినిమా వాయిదా పడటం టాలీవుడ్‌కి అవమానకరమైన విషయంగా మారింది. తాజా వివాదంలో 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక షోలకు, ప్రీమియర్‌కు అనుమతి ఇవ్వలేదని చివరి నిమిషం వరకు నిర్మాతలు ప్రయత్నాలు సాగించారు. ఒకవైపు స్పెషల్ షోల కోసం ఇంతగా శ్రమించిన నిర్మాణ సంస్థ.. ఈరోస్ ఇంటర్నేషనల్‌తో ఉన్న పాత బకాయిలు, న్యాయపరమైన సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయిందనేది ప్రధాన ప్రశ్న.
Also Read- New Guy In Town: సంచలనం రేపుతున్న ఎస్. థమన్ ట్వీట్.. టాలీవుడ్‌లో ఆ మిస్టీరియస్ ‘న్యూ ఫేస్’ ఎవరు?
నిర్మాతలు మారరా? పాఠాలు నేర్చుకోరా?
ఇలాంటి ప్రాథమిక సమస్యను పెట్టుకుని, ప్రపంచవ్యాప్తంగా సినిమాను ఎలా విడుదల చేయాలనుకున్నారు? అని సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల తమ అభిమాన హీరో బాలయ్య పరువు పోయిందిగా అంటూ అభిమానులు సైతం నిర్మాణ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, ఇలాంటి న్యాయపరమైన అడ్డంకులు, ఆర్థికపరమైన వివాదాలు టాలీవుడ్‌కి కొత్తేమీ కాదు. గతంలోనూ పలువురు స్టార్ హీరోల సినిమాల విడుదల సమయంలో చివరి నిమిషంలో ఇలాంటి చిక్కులు ఎదురయ్యాయి. వాటిని జయించి ఎలాగోలా సినిమాను విడుదల చేశారే తప్ప, ఇలా విడుదలకు గంట ముందు ఆగిపోవడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. ఇది అత్యంత అవమానకరమైన విషయంగా భావించాలి.
మొదట చేయాల్సింది ఇదే
అసలు నిర్మాతలు కాంబినేషన్లు సెట్ చేయడంపై, భారీ బడ్జెట్‌లు చూపించడంపై పెట్టిన శ్రద్ధ, ఇలాంటి కీలకమైన లీగల్ ఇష్యూస్‌పై ఎందుకు పెట్టడం లేదు? అని ఇండస్ట్రీ పెద్దలు కొందరు నిర్మాతల తీరుపై మండిపడుతున్నారు. పరిశ్రమలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా, పాత పాపాలు వెంటాడుతున్నా.. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదనేది వారి ప్రధాన ఆవేదన. ప్రతి స్టార్ హీరో సినిమా విడుదల విషయంలో ఎదురవుతున్న ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే, నిర్మాతలు తమ విధానాన్ని మార్చుకోవాలి. సినిమా విడుదలకు కనీసం ఒక నెల ముందుగానే, పెండింగ్‌లో ఉన్న పాత బకాయిలు, న్యాయపరమైన వివాదాలను పూర్తిగా పరిష్కరించుకోవాలి. స్టార్ కాంబినేషన్ల క్రేజ్‌ను కాదు, వృత్తిపరమైన క్రమశిక్షణను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. లేకపోతే, ఈ చర్యలు ఇండస్ట్రీ మొత్తానికి చెడ్డపేరు తీసుకురావడంతో పాటు, స్టార్ హీరోల ఇమేజ్‌ని సైతం డ్యామేజ్ చేస్తాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. నిర్మాతలు ఇప్పటికైనా మేల్కొని, టాలీవుడ్ స్థాయిని, నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యతను గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

