The Maze: ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు, రోజా పూలు’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా పరిచయమైన నటుడు శ్రీరామ్ (Sriram). తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించిన శ్రీరామ్.. తాజాగా తెలుగులో రూపుదిద్దుకుంటోన్న ‘ది మేజ్’ (The Maze) చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రియాంక శర్మ, హృతిక శ్రీనివాసన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ రవికిరణ్ గడలే (Dr. Ravikiran Gadale) దర్శకుడు. కేఎస్‌ఆర్ సమర్పణలో ఉదయ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై ఉదయ్ కె. రెడ్డి పల్వాయి, కె. శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం (జనవరి 29) ఈ చిత్ర ఫస్ట్‌లుక్ (The Maze First Look)తో పాటు టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ మంచి ఆదరణను రాబట్టుకుంటూ, సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.
Also Read- Bhartha Mahasayulaku Wignyapthi: ‘అద్దం ముందు’ వీడియో సాంగ్.. అబ్బ, ఎంత అందంగా ఉంది!
నిజం అంటే ఏమిటి?
టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలే మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి జీవితాన్ని కేంద్రంగా చేసుకుని నడుస్తుంది. అతని వాస్తవిక జీవితం, మానసిక స్థితి అంతగా కలిసిపోయి ఉంటాయి కాబట్టి, అతను ఒక కలల ప్రపంచంలో జీవిస్తున్నట్టే అనిపిస్తుంది. ఈ సినిమా జ్ఞాపకాలు, గ్రహణశక్తి, గుర్తింపు వంటి అంశాలను లోతుగా పరిశీలిస్తూ.. ‘నిజం అంటే ఏమిటి?’ అనే ప్రశ్నను ప్రేక్షకుల ముందుంచుతుంది. మర్మమైన ఆ వ్యక్తి ఉనికి చివరి వరకు ఒక ప్రశ్నగానే మిగులుతుంది. అతను హీరో అవచేతన మనస్సుకు ప్రతీకనా? భయం, అపరాధభావం లేదా గతంలోని గాయాల రూపమా? లేక నిజంగానే అతని జీవితంతో ముడిపడి ఉన్న ఎవరైనా వ్యక్తినా?.. ఆ ప్రశ్నకు సమాధానం అతని మానసిక స్థితిని అర్థం చేసుకునేందుకు కీలకంగా మారుతుంది.
Also Read- Movie Press Meet: ఒకే టైమ్‌కి రెండు వేరు వేరు సినిమాల ప్రెస్ మీట్స్.. దర్శకనిర్మాతలు అసంతృప్తి!
కొత్తదనంతో కూడిన కథ
మొత్తంగా.. ఈ సినిమా వాస్తవం, భ్రమల మధ్య సరిహద్దులను చెరిపేస్తూ, ప్రేక్షకులను చివరి వరకూ ఉత్కంఠలో ఉంచుతుంది. ఇది మానవ మనస్సు యొక్క సంక్లిష్టతను భావోద్వేగాలతో నిండిన రీతిలో చూపించే, ఆలోచనలను రేకెత్తించే, ఉత్కంఠభరితమైన, ఆకట్టుకునే సినీ అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తుందని నమ్మకంగా చెప్పగలను. కొత్తదనంతో కూడిన సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారనే ప్రగాఢంగా నమ్ముతున్నాను’’ అని చెప్పుకొచ్చారు. అజయ్, రవివర్మ వంటి ఇతర నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే చిత్ర టీజర్‌ను విడుదల చేస్తామని ఈ సందర్భంగా దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలే తెలిపారు. ప్రస్తుతం ఈ టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

