TFCC Chairman: తెలుగు చిత్ర పరిశ్రమలోని పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka), సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఇటీవల కోఆర్డినేషన్ కమిటీ సమావేశమై థియేటర్స్ టికెట్ రేట్స్, తిను బండారాల ధరలు వంటి విషయాలపై చర్చించడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ (Pratani Ramakrishna Goud) మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం నేను మీడియా సమావేశం నిర్వహించి టికెట్ రేట్స్, థియేటర్స్‌లో తినుబండారాల ధరలు తదితర సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరమైన విషయం. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఇటీవల కోఆర్డినేషన్ కమిటీ సమావేశమై.. చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మేము కోరేది ఒక్కటే.. సినిమాను సామాన్య ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని మేము కోరుతున్నాం. సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. థియేటర్స్‌లో టికెట్ రేట్స్ ఎక్కువగా ఉండటం, తినుబండారాల రేట్స్ అధికంగా ఉండటంతో సామాన్య ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదు. ‘తమ్ముడు’ సినిమా ఫంక్షన్‌లో దిల్ రాజు టికెట్ రేట్స్ ఇకపై పెంచమని చెప్పడం అభినందనీయం.
అలాగే క్యూబ్, యూఎఫ్‌వో వంటి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ రేట్స్‌పై కూడా దృష్టి పెట్టాలి. ముంబై వంటి ఉత్తరాది నగరాల్లో ఈ చార్జెస్ రూ. 3 వేల లోపు ఉంటే, మన దగ్గర మాత్రం రూ. 10 నుంచి 15 వేల రూపాయల వరకు ఉంటోంది. నేను ఇటీవల ‘ఝాన్సీ’ అనే సినిమాను 50 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తే 5 లక్షల రూపాయలకు పైగా ఈ డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్‌కే ఖర్చైంది. ఇది చిన్న నిర్మాతల మీద పెను భారంగా మారుతోంది. ఏడాదికి నిర్మాణమయ్యే చిత్రాల్లో 90 శాతం చిన్న నిర్మాతలవే ఉంటున్నాయి. పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజ్ కూడా చేసుకోలేకపోతున్నాయి. ఇలా దాదాపు 400 నుంచి 500 చిత్రాల వరకు కంప్లీటై కూడా రిలీజ్ కాకుండా ఆగిపోయి ఉన్నాయి.
Also Read- Tollywood: పవన్ కళ్యాణ్ లేఖ పని చేస్తోంది.. ఏపీ సీఎం చెంతకు సినీ ఇండస్ట్రీ!
టాలీవుడ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ విషయంలో కూడా ఆయన కల్పించుకుని చార్జెస్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. త్వరలో ఆయనను మా టీఎఫ్‌సీసీ తరుపున కలిసి అభినందనలు తెలియజేస్తాం. చిత్ర పరిశ్రమలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు ఆడితేనే నిర్మాతలు బాగుంటారు. బుక్ మై షో వంటి ప్లాట్ ఫామ్స్‌తో నిర్మాతలకు నష్టం వాటిల్లుతోంది. ఎఫ్‌డీసీ ద్వారా ఈ-టికెట్ బుకింగ్ సౌకర్యం తీసుకురావాలని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం. అప్పుడు మాత్రమే ప్రైవేట్ టికెట్ బుకింగ్ సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయగలం. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, డిఫ్యూటీ సీఎంలకు మా టీఎఫ్‌సీసీ తరుపున రిప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు