They Call Him OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’ (OG Movie). డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. ఓజాస్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు ఏ విధంగా పెరిగిపోతున్నాయో తెలియంది కాదు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటి విడుదల అవుతుంటే.. అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. సంగీత సంచలనం ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ‘ఓజీ’ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’కి ట్రెండ్ బద్దలు కొట్టింది. సంగీత తుఫాను వంటి ఈ పాట అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదలైంది. ‘ఫైర్ స్ట్రోమ్’కి పూర్తి భిన్నంగా, అసలు ఎవరూ ఊహించని విధంగా.. హృదయాలను హత్తుకునేలా ఈ సాంగ్ ఉంది. ఈ పాట విడుదలైన క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతల మనసులను గెలుచుకుంటోందంటే తమన్ ఎంతగా ప్రాణం పెట్టి ఈ పాటను రెడీ చేశారో అర్థం చేసుకోవచ్చు. తమన్ అద్భుతమైన సంగీత ప్రయాణంలో గొప్ప పాటలలో ఒకటిగా ఈ పాట నిలిచిపోతుందని అప్పుడే టాక్ రావడం విశేషం.
Also Read- Vinayaka Chavithi 2025: ఇవాళ ఒక్క రోజు వర్షాన్ని ఆపు గణపయ్యా.. అంటూ వేడుకుంటున్న భక్తులు
‘సువ్వి సువ్వి’ అంటూ సాగిన ఈ ప్రేమ గీతాన్ని తమన్ ఎంత అందంగా స్వరపరిచారో.. గాయని శృతి రంజని అంతే మధురంగా ఆలపించారు. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని ఈ పాటకు సాహిత్యం అందించారు. విన్న వెంటనే శ్రోతల హృదయాలను దోచేలా ఉన్న ఈ పాట ఒక ఆత్మీయమైన లోతును తెలియజేస్తుంది. ప్రేమ పాటలను స్వరపరచడంలో దిట్టగా తమన్ ఎందుకు రాజ్యమేలుతున్నారో ఈ గీతం మరోసారి రుజువు చేసింది. పాటను కంపోజ్ చేసిన తీరు మొత్తాన్ని ఇందులో చూపించడం ఈ పాటకు మరో ఎస్సెట్‌గా మారింది. ఇక ఈ పాటలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటను చూడటానికి రెండు కళ్లు చాలడం లేదంటే నమ్మాలి. ఈ జోడీ తెరపై సరికొత్తగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పవర్‌ని సమతుల్యం చేసేలా కన్మణిగా ప్రియాంక మోహన్ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా పవన్, ప్రియాంక జోడి నిలుస్తోందనడంలో అసలు అతిశయోక్తి లేనే లేదు. ఈ పాట వచ్చినప్పటి నుంచి, ఈ జంటను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటి ‘ఓజీ’ అనడంలో అసలు సందేహమే లేదు. 25 సెప్టెంబర్, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం నుండి వచ్చిన ప్రతి అప్‌డేట్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తూ ట్రెండ్‌ని షేక్ చేస్తుంది. ఇప్పుడు మాస్‌ను శ్రావ్యతతో మిళితం చేస్తూ స్వరపరిచిన ‘సువ్వి సువ్వి’ సాంగ్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రతిభగల సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు