ఒక ప్రేమ జంట వారి తొలి ముద్దును ఏకాంతంగా, ఎవరూ చూడని ప్రదేశంలో పెట్టుకోవాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ, భాగ్యనగరంలో వారికి ఆ ఏకాంత ప్రదేశమే దొరకకపోతే.. ఆ జంట ముద్దు కోరిక తీరకపోతే.. ముద్దు పెట్టుకోవాలనుకున్న ఆ జంటకే కాదు, చూసే వారికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. అవును, సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) బాధని చూస్తుంటే పాపం అని జాలేస్తుంది. నీ కష్టం పగోడికి కూడా రాకూడదని అనాలనిపిస్తుంది. ముద్దు కోసం ఎన్ని ప్రదేశాలకు వెళ్లినా ఏదో ఒక ఆటంకం కలుగుతుంటే, ఎవరో ఒకరు అడ్డుపడుతుంటే.. విసిగిపోయిన ఓ ప్రేమికుడు ఏం చేస్తాడు? ఆ సమయంలో ఆయన ఓ పాట పాడుకుంటే ఎలా ఉంటుంది? అనే దానికి ఉదాహరణ అన్నట్లుగా ఉంది సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ నుంచి వచ్చిన లవ్ సాంగ్.
Also Read- Rana Daggubati: దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్‌లపై కేసు నమోదు.. ఏంటి ఇంత సీరియస్‌గా తీసుకున్నారా?
‘ఈ హైదరాబాద్ మొత్తంలో నాకంటూ ముద్దు పెట్టుకోవడానికి ఓ ప్లేస్ లేకపోవడమా.. దా’ అంటూ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanyaను సిద్ధు జొన్నలగడ్డ గుంజుకుంటూ పోతున్నట్లుగా రీసెంట్‌గా వచ్చిన ప్రోమోలో ఉంది. దానికి కంటిన్యూ అన్నట్లుగా ఇప్పుడొచ్చిన పాటను లైన్ చేశారు. సిద్ధు చెప్పిన ఆ డైలాగ్ తర్వాత సాంగ్ మొదలవుతుంది.
‘‘భాగ్యనగరం అంతా.. మనదే మనదే
నీ బాధే తీరుస్తానే.. పదవే పదవే
జంటైపోదామందే.. పెదవే పెదవే
దునియాతో పనిలేదింక.. పదవే పదవే
స్మోకింగ్ చేయగా స్మోక్ జోన్ ఉందిగా.. కిస్సుకి లేదే కిస్సింగ్ జోన్
ఆల్కహాలుకే ఉందిలే వైన్ మార్ట్.. ముద్దుకి లేదే సింగిల్ స్పాట్
ఆరోగ్యం చెడగొట్టే బ్యాడ్ హ్యాబిట్స్‌కే నెలవుందే
స్ట్రెస్ అంతా పోగొట్టే పెదవులకేంటీ ఇబ్బందే
ఊరిస్తున్నదే వేధిస్తున్నదే.. ఊహల నిండా నీ ముద్దే
జాగా లేదని జాగే చేయకే.. ప్రాణం పోతున్నట్టుందే
అధరాలే అరిగేలా ఇవ్వాలని ఉందే చుమ్మా
మూడంతా చెదిరేలా వంకలు చెబుతావేంటమ్మా’’ వంటి సనారే రాసిన సాహిత్యంతో సాగిన ఈ పాటను చూస్తుంటే ప్రేమికుల వేధన తెలుస్తుంది. ముద్దు కోసం వారు పడే ఆవేదన అర్థమవుతుంది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ‘గోదారి గట్టు మీద రామచిలకవే’ అంటూ భార్యభర్తల మధ్య సరసపు గీతంతో భాస్కరభట్ల ట్రెండ్ బద్దలుకొడితే.. ఈసారి పెళ్లికి ముందు ప్రేమికుల బాధను వర్ణిస్తున్నట్లుగా ‘సనారే’ తన ప్రతిభను చాటారు. ఈ పాటను జావెద్ అలీ, అమల చేబోలు ఆలపించగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. భాస్కర్ కంపోజ్ చేసిన ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేశారు. ఇందులో ‘హుక్’ స్టెప్ కూడా ఉందండోయ్. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read- Pawan Kalyan: అన్నయ్యకు జీవిత సాఫల్య పురస్కారం.. ఆనందంలో తమ్ముడు!
బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో ‘జాక్ – కొంచెం క్రాక్’ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. టాలీవుడ్ టాప్ బ్యానర్లలో ఒకటైన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ నిర్వహిస్తున్నారు. అతి త్వరలోనే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు