Biker First Lap: చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Charming Star Sharwanand) నుంచి సినిమా వచ్చి దాదాపు వన్ ఇయర్ పైనే అవుతుంది. ఆయన నటించి, చివరిగా విడుదలైన చిత్రం ‘మనమే’. ఈ సినిమా కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ‘శతమానం భవతి’ సినిమా తర్వాత దాదాపు 10 సినిమాలు శర్వానంద్ చేశారు. కానీ ఏదీ కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. కొన్ని ప్లాప్స్, మరికొన్ని యావరేజ్‌గానే నిలబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన వేసే ప్రతి అడుగు చాలా ఇంపార్టెంట్. అందుకే తన తదుపరి చిత్రాల విషయంలో శర్వానంద్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటించిన తాజాగా చిత్రం ‘బైకర్’ (Biker). ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ని ‘ఫస్ట్ లాప్’ (Biker First Lap) పేరుతో తాజాగా థియేటర్లలోకి వచ్చిన సినిమాలకు యాడ్ చేసిన విషయం తెలిసిందే. డిజిటల్‌గా కూడా ఈ ఫస్ట్ లాప్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లాప్ ఎలా ఉందంటే..
Also Read- Peddi: అచ్చియమ్మగా జాన్వీ కపూర్.. డబుల్ ట్రీట్ ఇచ్చిన మేకర్స్!
ఏం జరిగినా పట్టు వదలని మొండోళ్ల కథ
‘బైకర్’ సినిమాలో శర్వానంద్ మైటార్‌సైకిల్ రేసర్‌గా థ్రిల్ చేయబోతున్నారు. బైక్ రేసింగ్‌తో ఈ గ్లింప్స్‌ని స్టార్ట్ చేశారు. ‘ఇక్కడ ప్రతి బైకర్‌కు ఓ కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ. చావుకు ఎదురెళ్లే కథ..’ అనే డైలాగ్ వాయిస్ ఓవర్‌లో వినిపిస్తుంటే.. రేసింగ్‌కి శర్వానంద్ రెడీ అవుతున్నారు. ఈ రేసింగ్ భయానకంగా ఉంది. యాక్సిడెంటై మధ్యలో చాలా మంది రేసర్స్ పడిపోయారు. ‘ఏం జరిగినా పట్టు వదలని మొండోళ్ల కథ’ అని వాయిస్ ఓవర్ చెబుతుంటే.. తెరపై కనిపించే సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. శర్వానంద్ కూడా రియల్ స్టంట్స్ చేసినట్లుగా ఈ గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక గ్లింప్స్ అయిపోయింది అనుకునే సమయంలో.. ‘గెలవడం గొప్ప కాదు.. చివరిదాకా పోరాడటం గొప్ప’ అంటూ యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ (Angry Man Rajasekhar)ని సీన్‌లోకి తెచ్చిన తీరు చూస్తుంటే.. ఓ అద్భుతమైన కథ ఇందులో దాగున్నట్లుగా అర్థమవుతోంది. మొత్తంగా అయితే, ఈ గ్లింప్స్‌తోనే సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు మేకర్స్.
1990, 2000 బ్యాక్ డ్రాప్‌లో సాగే రేసింగ్ మూవీ
టెక్నికల్‌గా కూడా ఈ సినిమా చాలా హై రేంజ్‌లో ఉండబోతుందనేది ఈ గ్లింప్స్ తెలియజేస్తుంది. దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Reddy Kankara) దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది. ఇందులో శర్వానంద్ లుక్ కూడా వైవిధ్యంగా ఉంది. 1990, 2000 బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ రేసింగ్ మూవీ.. యాక్షన్‌తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామా అని మేకర్స్ చెబుతున్నారు. స్పీడ్, అంబిషన్, హార్ట్‌ఫెల్ట్ రిలేషన్‌షిప్స్‌తో మూడు జనరేషన్స్ ఒకే రేసింగ్ కలతో, కుటుంబ బంధాలతో సాగే అద్భుతమైన కథ ఇదని ఇప్పటికే మేకర్స్ కథపై క్లారిటీ ఇచ్చారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
