Save the Tigers Season 3: తెలుగు ఓటీటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ మూడవ సీజన్‌తో (Save the Tigers Season 3) మళ్లీ రాబోతోంది. మొదటి రెండు సీజన్‌లు అఖండ విజయం సాధించడంతో, ఇప్పుడు జియో హాట్‌స్టార్.. ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ త్వరలో రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటు ఓ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఈ గ్లింప్స్.. ఈ కొత్త సీజన్‌లో నవ్వులకు, సరదా గొడవలకు కొదవ ఉండదని స్పష్టం చేస్తోంది.
సరదాగా సాగే భర్తల కష్టాలు!
‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ ప్రధానంగా ముగ్గురు భర్తల చుట్టూ తిరుగుతుంది. వీరు తమ భార్యల నుంచి ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, గొడవలు, ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు, చివరికి ఎలా ఇరుక్కుపోతారు అనే కథాంశంతో సాగుతుంది. ప్రతీ భర్త తమ జీవితంలో ఎదుర్కొనే నిత్య సమస్యలను, వాటిని అతి సరదాగా చూపించడం ఈ సిరీస్ ప్రత్యేకత. అందుకే, ఇది కుటుంబ ప్రేక్షకులను, ముఖ్యంగా భర్తల మనోభావాలను బాగా కనెక్ట్ చేసింది.
Also Read- Ravi Teja BMW: అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే.. మెలోడీతో వచ్చిన మాస్ మహారాజా!
ఈ ప్రోమోలో ఏం ఉంది?
కేవలం 58 సెకన్ల నిడివి ఉన్న ఈ ‘కమింగ్ సూన్’ ప్రోమో, మూడవ సీజన్‌లో కూడా నవ్వుల డోస్ తగ్గలేదనే హామీ ఇస్తోంది. ముగ్గురు హీరోలు తమదైన స్టైల్‌లో భార్యల బెడద నుంచి తప్పించుకోవడానికి చేసే అమాయక ప్రయత్నాలు, పొరపాట్లతో కూడిన సీన్స్ ఇందులో హైలైట్ అయ్యాయి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగే సన్నివేశాలు కాబట్టి, ప్రోమో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. పాత పాత్రలు, నటీనటులు అందరూ తిరిగి మూడో సీజన్‌లో కూడా భాగమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కి ఇంతటి ప్రజాదరణ దక్కడానికి ప్రధాన కారణం, దీని కథాంశం సాధారణ ప్రేక్షకుల జీవితాలకు దగ్గరగా ఉండటమే. ఇంట్లో భార్య చేతిలో నలిగిపోయే భర్తలు తమ కష్టాలను, ఆవేదనను ఈ సిరీస్‌లోని పాత్రల్లో చూసుకుని నవ్వుకుంటున్నారు. ఆఫీసులో టెన్షన్, ఇంట్లో భార్య టెన్షన్.. ఈ రెండింటి మధ్య నలిగిపోయే భర్తల కథను కమర్షియల్ హంగులు లేకుండా, సహజమైన కామెడీతో చూపించడం ప్రేక్షకులకు బాగా నచ్చింది.
Also Read- Bigg Boss Telugu 9: మళ్లీ హౌస్‌మేట్స్‌ని ఇరకాటంలో పెట్టిన బిగ్ బాస్.. ఈసారి ఇద్దరు?
కొత్త కష్టాలతో..
మొదటి రెండు సీజన్‌ల తర్వాత, మూడవ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోతో ఈ ఎదురుచూపులు మరింత పెరిగాయి. ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ త్వరలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నట్లు జియో హాట్‌స్టార్ ఓటీటీ వెల్లడించింది. ఎప్పుడెప్పుడు ఈ కొత్త సీజన్ వస్తుందా అని ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోసారి ఈ ముగ్గురు ‘టైగర్స్’ తమ భార్యల నుంచి ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు, ఈ సారి ఎలాంటి కొత్త కష్టాలు ఎదురవుతాయి అనే అంశాలు తెరపై చూడాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

