Tribanadhari Barbarik OTT: ‘కట్టప్ప’ సత్యరాజ్ (Satya Raj), ఉదయభాను (Udayabhanu) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik). మైథలాజికల్, సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ విడుదల సమయంలో.. దర్శకుడి సెల్ఫీ వీడియో కారణంగా పెద్ద చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా.. అంచనాలు అందుకోలేక తీవ్ర నిరాశకు గురి చేయడంతో.. ఈ సినిమా దర్శకుడు మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa) మనస్తాపానికి గురయ్యారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదంటూ కన్నీరు పెట్టుకొని, తను గతంలో ఓ వేదికపై చెప్పినట్లుగానే చెప్పుతో కొట్టుకుని సంచలనం సృష్టించారు. ఇటువంటి వివాదాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం నిజంగానే ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టలేకపోకపోయింది.
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే..
థియేటర్లలో మెప్పించలేకపోయినా, ఓటీటీలో ఈ సినిమా మంచి ఆదరణను రాబట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమా అక్టోబర్ 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్ట్స్ (SunNXT)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనున్నట్లు తెలుపుతూ, సన్ నెక్ట్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఉదయభాను లేడీ డాన్‌గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం ఈ సినిమాకి మరో ఆకర్షణ. థియేటర్లలో చూడలేనివారు, అలాగే దర్శకుడి ఆవేదనకు కారణమైన ఈ సినిమా కథ ఏమిటో తెలుసుకోవాలనుకునే వారు.. ఈ సినిమాను ఓటీటీలో చూసి సక్సెస్ చేస్తారేమో చూడాల్సి ఉంది.
‘త్రిబాణధారి బార్బరిక్’ కథ ఏమిటంటే..
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో సత్యరాజ్.. పేరు మోసిన మానసిక వైద్య నిపుణుడు శ్యామ్ కతు (బార్బరిక్) పాత్రలో నటించారు. కొడుకు, కోడలు మరణించడంతో, తన మనవరాలు నిధి (మేఘన)ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. అనుకోకుండా నిధి కనిపించకుండా పోతుంది. స్కూల్‌కు వెళ్లిన పాప మిస్సింగ్ అని తెలియడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి శ్యామ్ కతు చేసే పోరాటమే ఈ సినిమా. దీనికి రామ్ (వశిష్ట ఎన్ సింహ), లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను) వంటి పాత్రలకు ఉన్న సంబంధం ఏమిటి? చివరికి శ్యామ్ కతు తన మనవరాలిని ఎలా కనిపెట్టాడు? అసలీ కథకి, దర్శకుడు చెబుతున్న పురాణాలకు చెందిన బార్బరిక్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అన్నదే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
