Sanjay Kapoor: దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ ఆస్తికి సంబంధించిన న్యాయపోరాటం దిల్లీ హైకోర్టులో అత్యంత నాటకీయంగా సాగుతోంది. సుమారు రూ.30,000 కోట్ల విలువైన సంజయ్ కపూర్ వారసత్వం కోసం ఆయన మాజీ భార్య కరిష్మా కపూర్ పిల్లలు, ప్రస్తుత భార్య ప్రియా కపూర్ (ప్రియా సచ్‌దేవ్) మధ్య జరుగుతున్న ఈ కేసులో ప్రియా తరఫు న్యాయవాది సంచలనాత్మక ఆధారాలు సమర్పించారు. ఈ న్యాయవివాదంలోకి అనవసరమైన అంశాలను లాగవద్దని, ‘మెలోడ్రామా’ను తగ్గించాలని కోర్టు గతంలో ఇరుపక్షాలకు సూచించింది. కరిష్మా కుమార్తె తరఫు న్యాయవాది రెండు నెలల ఫీజులు చెల్లించలేదని ఆరోపించగా, ప్రియా తరఫు న్యాయవాది శైల్ ట్రెహాన్ ఈ వాదనను బలంగా తిప్పికొట్టారు. పిల్లల యూనివర్సిటీ ఫీజులకు సంబంధించి ఒక సెమిస్టర్‌కు రూ.95 లక్షలు చెల్లించిన రసీదును ఆయన కోర్టుకు సమర్పించారు. తదుపరి ఫీజు వాయిదా డిసెంబర్‌లో మాత్రమే చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ రసీదు సమర్పణతో ఫీజుల వివాదానికి తెరపడింది.
అనంతరం, కోర్టు సంజయ్ కపూర్ రాసిన వీలునామా ప్రామాణికత అనే ప్రధాన అంశంపై దృష్టి సారించింది. కరిష్మా, ఆమె పిల్లలు ఈ వీలునామా నకిలీదని ఆరోపిస్తున్నారు. ప్రియా తరఫు న్యాయబృందం ఈ వీలునామా చట్టబద్ధతను నిరూపించడానికి అనేక డిజిటల్, భౌతిక ఆధారాలను సమర్పించింది. న్యాయవాది నితిన్ శర్మ ల్యాప్‌టాప్‌లో వీలునామా మొదటి డ్రాఫ్ట్ తయారైందని, ఎడిట్‌ల టైమ్‌లైన్‌ను, మార్చి 10, 2025న సంజయ్ సమీక్షించారని, మార్చి 17, 2025న తుది రూపం వచ్చిందని తెలిపారు. వీలునామా తయారీకి సంబంధించిన ప్రతి అడుగునూ స్క్రీన్‌షాట్లు, ఫైల్ హిస్టరీలు, మెటాడేటా ద్వారా కోర్టుకు చూపించారు. ఈ డేటా సంజయ్ కపూర్ ప్రయాణ రికార్డులతో సరిగ్గా సరిపోలింది. వీలునామా సృష్టించిన వర్డ్ ఫైల్ నుండి సంతకం చేసిన PDFగా మారడం, అకౌంటెంట్ దినేష్ అగర్వాల్‌తో జరిగిన ఇమెయిల్ సంభాషణలు, చివరకు సంజయ్ కపూర్ ఫ్యామిలీ ఆఫీస్ వాట్సాప్ గ్రూప్‌లో సాయంత్రం 5:01 గంటలకు వీలునామాను వీక్షించడం వంటి ప్రతి దశనూ రికార్డులతో సహా వివరించారు.
Read also-Akhanda 2: బాలయ్య బాబు ‘అఖండ 2’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరంటే?..
వీలునామాపై ఉన్న సంతకం నకిలీదని ప్రతివాదులు చేసిన కొత్త ఆరోపణను ప్రియా తరఫు న్యాయవాదులు గట్టిగా ఖండించారు. ప్రతివాదులు (కరిష్మా పిల్లలు) ఇదే సంతకాన్ని ఉపయోగించి గతంలో RK ఫ్యామిలీ ట్రస్ట్ నుండి రూ.2,000 కోట్ల విలువైన ప్రయోజనాలను పొందారని, సంజయ్ కపూర్ మిగిలిన వ్యక్తిగత ఆస్తుల కోసం జరుగుతున్న ఈ వివాదంలోనే సంతకాన్ని ప్రశ్నించడం విడ్డూరమని ఎత్తి చూపారు. వీలునామా రిజిస్టర్ కానందున అది అనుమానాస్పదమనే వాదనను కూడా న్యాయవాది తోసిపుచ్చారు. భారతీయ చట్టాల ప్రకారం వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని, దిల్లీలో ప్రొబేట్ అవసరం లేదని, విదేశీ ఆస్తులు ఎక్కువగా ఉన్నందున ఇది అవసరం లేదని తెలిపారు. సంజయ్ కపూర్ మరణించిన తర్వాత ప్రియా కపూర్ పిల్లల విద్య, ఆరోగ్యం కోసం ట్రస్ట్ ఆదేశాల ప్రకారం రూ.1 కోటికి పైగా ఖర్చు చేశారని కోర్టుకు తెలిపారు.
