Rakesh Poojary: కాలం ఎంత విచిత్రమైనదో.. ఈ కమెడియన్ విషయంలో మరోసారి వెల్లడైంది. ఎన్నో ఇబ్బందులు పడి, బాగా సంపాదించిన తర్వాత, దానిని అనుభవించడానికి వయసు అయిపోవడమో, లేదంటే ప్రాణం పోవడమో జరుగుతుంది. అనుభవించాలని అనుకున్నప్పుడు ఆస్తి ఉండదు.. ఆస్తి సంపాదించిన వారంతా అనుభవించలేరు. ఒక్కోసారి కాలం ఇలా విచిత్రంగా నడుస్తుంటుంది. ఇప్పుడు కమెడియన్ రాకేష్ పూజారి (Rakesh Poojary) విషయంలో కూడా అదే జరిగింది. ఆయన కేవలం 33 సంవత్సరాల వయసులోనే గుండెపోటుతో కన్నుమూసి, సినీ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన నటుడిగా గుర్తింపు పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఇప్పుడా ప్రయత్నాలు నెరవేరి మంచి సక్సెస్ వస్తే.. ఆ సక్సెస్‌ను అనుభవించడానికి ఆయన భూమి మీద లేరు. అవును, రాకేష్ పూజారి ఓ కీలక పాత్రలో నటించిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం విడుదలై, సంచలనాలను సృష్టిస్తోంది. కానీ ఆ సక్సెస్‌ను చూడడానికి ఆయన లేకపోవడంతో.. ఆయన అభిమానులు తీవ్ర దిగ్భాంతికి లోనవుతున్నారు.
Also Read- King100: కింగ్ నాగార్జున 100వ చిత్రానికి క్లాప్ పడింది.. దర్శకుడు ఎవరంటే?
రాకేష్ పూజారి పాత్రకు విశేష ఆదరణ
‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) చిత్రంలో రాకేష్ పూజారి పాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పాత్ర నవ్వులు పూయించి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. సినిమా విడుదలై అద్భుతమైన విజయం సాధించి, ఆయన పాత్రకు విశేషమైన ఆదరణ దక్కుతున్న ఈ తరుణంలో, ప్రేక్షకుల ఆ ప్రేమను చూసేందుకు ఆయన లేకపోవడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఆయన పాత్రను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో అభిమానులు కన్నీటితో నివాళులు అర్పిస్తున్నారు. హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) కూడా రాకేష్ మృతిపై స్పందించారు. ‘‘రాకేష్ నాకు తమ్ముడిలాంటి వాడు. ఎప్పుడూ నవ్వుతూ, ఎంతో సానుకూల దృక్పథంతో ఉండేవాడు. ఇంత త్వరగా వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన మళ్లీ జన్మించాలి’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అప్పట్లో ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Also Read- OG Collections: విధ్వంసం.. ‘ఓజీ’ మూవీ 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొత్తం ఎంతంటే?
షూటింగ్ పూర్తైన కొద్ది రోజులకే విషాదం
రాకేష్ పూజారి మరణం అత్యంత విషాదకరమైనది. ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఆయన విజయవంతంగా పూర్తి చేసుకున్న 15 నుంచి 20 రోజులకే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ఉడుపి జిల్లాలోని కార్కాల తాలూకాలోని నిట్టే ప్రాంతంలో తన స్నేహితుడి వివాహ వేడుక (మెహందీ ఫంక్షన్)లో పాల్గొన్న సమయంలోనే ఆయనకు ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. వెంటనే స్నేహితులు ఆసుపత్రికి తరలించినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. రాకేష్ పూజారి, కన్నడ బుల్లితెరపై ‘కామెడీ ఖిలాడిగలు’ రియాలిటీ షో సీజన్ 3 విజేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాకేష్, ‘పైల్వాన్’ వంటి పలు కన్నడ, తుళు చిత్రాల్లో నటించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
