Agamagam Edike Bava: ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహాకవి దాశరథి. తెలంగాణ ఎర్రని మాగాణంలో ఎక్కడ చూసినా పాట జాలువారుతుంది. అన్యాయాన్ని నిలదీసే విప్లవ గీతాలైనా, అక్షర ప్రళయాగ్ని రగిలించే పాటలైనా, మట్టి వాసనలా, అమ్మ ప్రేమలా జాలువారే జానపద బాణీలైనా, ఇలా ఎక్కడ చూసినా, ఎటు వెళ్లినా ఏదో ఒక పాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ జానపద గీతాల ట్రెండ్ నడుస్తున్నది. ఈ మధ్య ‘రాను బొంబాయికి రాను’ అంటూ మిస్ వరల్డ్ పోటీదారులు చేసిన డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించింది. మొత్తంగా లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి తెలంగాణ జానపదం ఎదిగింది. ఇదే క్రమంలో ‘స్వేచ్ఛ – బిగ్ టీవీ’ ది బిగ్ ఫోక్ నైట్ 2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఆగస్ట్ 23న ఎల్బీ స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనున్నది. తెలంగాణ జానపద కళాకారులు అందరూ ఇందులో పాల్గొననున్నారు. అయితే, కొత్తగా యూట్యూబ్‌లో మరో ఫోక్ సాంగ్ ట్రెడింగ్‌లోకి వచ్చింది. ఇన్‌స్టా ఓపెన్ చేస్తే చాలు ఈ సాంగ్‌పై రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అసలీ పాట ఎలా పుట్టింది, సృష్టకర్త ఎవరో చూద్దాం.
మొదట్లో రేడియో మెకానిక్
కొన్నాళ్ల క్రితం ‘రాను బొంబాయికి రాను’ అనే సాంగ్ యువతను ఓ ఊపు ఊపేస్తే ‘ఆగమాగం ఏడికే బావ’ సాంగ్ ఇప్పుడు 70, 80 పదుల మహిళలను సైతం ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సాంగ్ చేసిన వ్యక్తి రేడియో మెకానిక్ అంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. 1995లో తన అమ్మ ఇచ్చిన 250 రూపాయల పెట్టుబడితో రేడియో మెకానిక్‌గా కొత్తగూడెం పట్టణంలోని ఓ షాపు ముందు టేబుల్‌పై రోజుకు 10 రూపాయల చొప్పున చెల్లిస్తూ తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆయనే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగళ్ల గ్రామానికి చెందిన రవి బాబు. ప్రస్తుతం యూట్యూబ్‌లో పాటల ఆడియో, వీడియోలకు భారీగా ఆదాయం పొందుతూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
రవి బాబు విజయాలు
నిరుపేద కుటుంబంలో పుట్టిన రవి బాబు ఎన్నో ఒడిదుడుకుల మధ్య 1987లో 10వ తరగతి పూర్తి చేశారు. పై చదువులకు తగినంత స్తోమత లేక అంతటితో ఆపేశారు. తన కాళ్లపై తాను నిలబడాలనే ఆకాంక్షతో 1995లో తన అమ్మ రుక్మిణమ్మ ఇచ్చిన రూ.250 పెట్టుబడితో రేడియో మెకానిక్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఓ షాపు ముందు టేబుల్ పెట్టుకొని రేడియో మెకానిక్‌గా కొనసాగుతుండగా, ఓనర్ వద్దని వారించడంతో కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలో మరో షాపు ముందు రోజుకు 10 రూపాయలు చొప్పున నెలకు 300 రూపాయలు అద్దె చెల్లించేలా మాట్లాడుకుని తన మెకానిజాన్ని ప్రారంభించారు.
ఎదిగిన వాళ్లను అందుకోవాలని లక్ష్యంతో..
1995 సమయంలో ఎఫ్ఎం రేడియోలో ఇతరత్రా కార్యక్రమాల్లో విజయ లక్ష్యాలతో ముందుకు సాగి విజయ తీరాలను చేరిన వారి బాటలోనే పయనం చేయాలని రవి బాబు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ లక్ష్యంగా ముందుకు సాగడమే ధ్యేయంగా పనిచేశారు. అయితే, అప్పటికి రేడియో మెకానిక్ ఉపాధి అందరూ కోల్పోతున్నారు. రవి బాబు సైతం కోల్పోయారు. కొత్తగా ఆటో ట్రెండింగ్ నడుస్తుండడంతో ఆటోల్లో డెక్కులు, క్యాసెట్ల పని మొదలుపెట్టారు. ఆ తర్వాత స్నేహితుడు, ఇతరుల సహకారంతో 900 రూపాయల పెట్టుబడితో సీడీలను తీసుకొచ్చి ఆడియో రూపంలో రికార్డ్ చేసి, కేవలం ఒక్క రోజులోనే 1000 సీడీలను అమ్మారు. నాటి నుంచి ఇక వెనుతిరిగి చూడలేదు. అలా చేస్తున్న సమయంలోనే చిట్టి ఫండ్ ప్రారంభించాలనే ఆలోచన సైతం వచ్చింది. దీంతో 4500 చిట్టిని ప్రారంభించారు. చిట్టి దారుల సహకారంతో ఫ్రీ చిట్టి పేరిట తొలుత తానే తీసుకున్నారు. 4,500 పెట్టుబడితో విజయవాడ వెళ్లి శ్రీ దుర్గా ఆడియో సెంటర్‌కు బీజం వేశారు. ఆ సమయంలోనే సింగర్ రమాదేవి సహకారంతో అంజన్న చరిత్ర ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. అంజన్న చరిత్ర పాటలు అప్పట్లో సంచలనాన్ని సృష్టించాయి.
2005లో పెద్దమ్మ తల్లి సీడీ చేయాలనే..
అంజన్న చరిత్ర పాటలు అప్పట్లో సంచలనం సృష్టించడంతో తమ ప్రాంతానికే చెందిన పెద్దమ్మ తల్లి పేరిట సీడీ క్యాసెట్ చేయాలనే ఆలోచన వచ్చింది. దీంతో ఆలయ అర్చకుల సహకారంతో 2005లో పెద్దమ్మ తల్లి ఆడియో సీడీ రిలీజ్ చేశారు. ఆ తల్లి ఆశీస్సులతో సీడీ విపరీతంగా అమ్ముడుపోవడంతో రవి బాబు పేరు మర్మోగింది. దాదాపు ఈ ఆడియో క్యాసెట్లు లక్ష వరకు అమ్ముడుపోయాయి. తమ సమీప బంధువు పెద్దమ్మ కూనవరంలో నివాసం ఉండేవారు. అయితే పర్ణశాల చరిత్ర తోనే రామాయణ కథ మొదలైందని వివరించడంతో ఏనాటికైనా హిందువుల ఆరాధ్య దైవమైన రాముడి ఆడియో సీడీ చేయాలని ముందుకు సాగారు. అలా ప్రతి ముక్కోటి సమయానికి స్నేహితులతో కలిసి రవి బాబు భద్రాచలం వెళ్లేవారు. అప్పట్లో శ్రీరాముడి సాధారణ వ్యక్తులకు దర్శనం కావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో రవి బాబు తాను వీఐపీని కాను ఏనాటికైనా రాముడి దర్శనం కావాలని మొక్కుకొని వచ్చేవాడు.
Read Also- Janhvi Kapoor: ఛీ ఛీ వాడు మనిషేనా.. చాలా సిగ్గుచేటు.. జాన్వీ తీవ్ర ఆగ్రహం!
భద్రాచల క్షేత్ర దర్శనం
భద్రాద్రి శ్రీ సీతారామ ఆలయ అర్చకుల సహకారం, అప్పటి ఈవో రామకృష్ణ రాజు పర్మిషన్ తీసుకొని పర్ణశాల, భద్రాచలం, శ్రీ రామగిరి ప్రాంతాల్లో వీడియో చిత్రీకరణ చేశారు. అలా వీడియో చిత్రీకరణను పార్ట్ 1, పార్ట్ 2 గా విభజించి వీడియో, ఆడియోలను రిలీజ్ చేసి రామాయణ లింకులను ఎఫ్ఎం రేడియోలకు అందజేశారు. ఆ సమయంలోనే ఈవోగా పనిచేసిన ఆజాద్ విధుల సమయంలో 10 వేల సీడీలను ఫ్రీ గా ఎగుమతి చేశారు. నిరుపేద కుటుంబాలకు అడుగడుగున పరీక్షలే అన్న చందంగా రవి బాబుకు సైతం సమస్యలు చుట్టుముట్టాయి. 2015 వరకు దాదాపు తను అనుకున్న ప్రతి విషయంలోనూ విజయం సాధించారు కానీ, 2015లో సీడీల హవా తగ్గిపోయింది. మళ్లీ అక్కడ నుంచి తన జీవిత గమ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఓ వైపు సమస్యలు మరోవైపు తన కుమారుడిని ఎంబబీఎస్ చదివించాలి. ఈ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. కిరాణా, బుక్ స్టాల్ షాపుతో మరో స్టెప్ వేశారు. 2016 సంవత్సరం యూట్యూబ్‌పై అవగాహన ఉన్న వ్యక్తి సహకారంతో 3 వేల సాంగ్స్ అప్లోడ్ చేశారు. ఇలా ఒడిదుడుకుల నడుమ మరో రెండేళ్లు గడిచాయి. 2019లో యూట్యూబ్ ద్వారా ఆదాయం ప్రారంభమైంది. దీంతో యూట్యూబ్‌పై మరింత ఫోకస్ పెట్టారు. బిలీవ్, అమెజాన్, ఆపిల్, ఐ ట్యూన్స్ లతో ఒప్పందం చేసుకొని సాంగ్స్‌ను అప్లోడ్ చేయడం పనిగా పెట్టుకున్నారు. శ్రీ దుర్గా ఆడియోతో పాటు ఫోక్ వన్, భక్తి తెలుగు వన్, తెలుగు భక్తి వన్ లతో ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్ అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఖమ్మం కొత్తగూడెం జిల్లాల్లో శ్రీ దుర్గా ఆడియోస్ కంపెనీ ఫేమస్‌గా మారిపోయింది. యూట్యూబ్‌లో రవి బాబు చేస్తున్న ఆడియో, వీడియోలకు దాదాపుగా 7 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అలా రవి బాబు ఆదాయం సైతం నెలకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పెరిగిపోయింది. నిత్యం తన ఆడియో, వీడియోలకు సంబంధించినవి ఐదుగురు వ్యక్తులు అదేపనిగా పోస్ట్ చేస్తుండడంతో రవి బాబుకు ఇదే ఆదాయ వనరుగా మారింది.
అప్పట్లో తిరుమల వాసా పాటకు ప్రాచుర్యం
2012 నుంచి దాదాపు ఇప్పటివరకు తిరుమలవాస శ్రీ వేంకటేశ అనే పాట అన్ని సెల్‌ఫోన్లలో రింగ్‌టోన్‌గా మారిపోయింది. ఈ పాటను యూట్యూబ్‌లో దాదాపు రెండున్నర కోట్ల మంది వీక్షించారు. టైం బిలీవ్, ఇంటర్నేషనల్ సౌత్ ఇండియా డిజిటల్ మేనేజ్‌మెంట్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని పాటలు అందిస్తున్నారు. అమెజాన్, స్పోర్టిఫై, జియో సావన్, వింక్ మ్యూజిక్, టిక్ టాక్ సహా 26 యాప్స్ ద్వారా ఫేమ్ పొందిన బాణీలను సంగీత ప్రియులకు చేరువ చేశారు. వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇప్పటిదాకా 6వేల పాటలను అప్లోడ్ చేశారు.
Read Also- Mahabubabad Waterfalls: పర్యాటకులకు కనువిందు చేస్తున్న జలపాతాలు