Pushpa 3: ‘పుష్ప 3’ (Pushpa 3) కూడా ఉంటుంది.. తాజాగా సంచలన దర్శకుడు సుకుమార్ (Sukumar) చెప్పిన ఈ మాటతో ఒక్కసారిగా అభిమానులలో ఉత్సాహం ఆకాశాన్నంటుతోంది. ఇప్పటి వరకు ‘పుష్ప 3’ ఉంటుందా? అని అందరికీ అనుమానాలు ఉన్నాయి. తాజాగా జరిగిన ‘సైమా 2025’ (SIIMA 2025) అవార్డుల వేడుకలో ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule) చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్న సుకుమార్ స్వయంగా ‘పుష్ప 3’ ఉంటుందని ప్రకటించారు. అదీ కూడా పక్కనే పుష్పరాజ్ అల్లు అర్జున్ (Allu Arjun)ను పెట్టుకుని. అంతే, ఆయన నిర్ధారించడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సుకుమార్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan)తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నారు. తన శిష్యుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న ‘పెద్ది’ సినిమా పూర్తవ్వగానే.. సుకుమార్‌తో రామ్ చరణ్ చేసే సినిమా సెట్స్‌పైకి రానుంది. ఆ సినిమా పూర్తయ్యే లోపు.. అల్లు అర్జున్ తనకున్న కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తి చేసుకోగలిగితే.. ‘పుష్ప 3’ సెట్స్‌పైకి రావడం ఏమంత కష్టం కాదు. అందులోనూ కొంత మేర షూటింగ్ కూడా చేశామని చెప్పారు కాబట్టి.. ‘పుష్ప 3’కి సుక్కు స్టోరీ రెడీ చేసి ఉంటాడని భావించవచ్చు.
Also Read- Kishkindhapuri: మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ లేకుండానే బెల్లంకొండ బాబు సినిమా.. మ్యాటర్ ఏంటంటే?
అసలేం జరిగిందంటే..
‘సైమా 2025’ అవార్డుల వేదికపై సుకుమార్‌ను హోస్ట్‌లు ‘పుష్ప 3’ ఉంటుందా? అని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం నిశ్శబ్దం అయిపోయింది. అసలు సుకుమార్ ఏం చెబుతారా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పక్కన ఉన్న బన్నీ.. సుకుమార్ వైపు చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అప్పుడే సుకుమార్ నోటి నుంచి ‘తప్పకుండా పుష్ప 3 ఉంటుంది’ అని ప్రకటించారు. అంతే ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లింది. ఎందుకంటే, ‘పుష్ప 3’ కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఎంతగానో వేచి చూస్తున్నారు. అల్లు అర్జున్ సమక్షంలోనే సుకుమార్ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడంతో.. ‘పుష్ప3: ది ర్యాంపేజ్’ (Pushpa 3: The Rampage)కు అఫీషీయల్‌గా కన్ఫర్మేషన్ ఇచ్చినట్లయింది. ప్రస్తుతం ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read- Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!
‘సైమా- 2025’లో ‘పుష్ప 2’ ప్రభంజనం
డిసెంబర్ 2024లో విడుదలైన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా నిజంగా బాక్సాఫీస్‌ని రూల్ చేసింది. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ, రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను సాధించిన రెండో సినిమాగా చరిత్ర సృష్టించింది. మొదటి పార్ట్‌కు అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ కూడా వరించింది. ఇప్పుడు జరిగిన ‘సైమా-2025’లో కూడా ‘పుష్ప 2’ తన సత్తా చాటింది. ఈ అవార్డులలో ఉత్తమ నటుడు, ఉత్తమ హీరోయిన్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డులను వరసగా అల్లు అర్జున్, రష్మిక మందన్నా, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ అందుకున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు