Padma Bhushan Award: సోమవారం ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో నటసింహం నందమూరి బాలకృష్ణ, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. వీరితో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా అవార్డులు అందుకున్నారు. అవార్డులు పొందిన వారందరూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యంగా ఈ అవార్డుల వేడుకలో నందమూరి నటసింహం అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు వ్యక్తిగా పంచె కట్టులో హాజరై, తెలుగువారి గొప్పతనాన్ని, గౌరవాన్ని చాటారు.
బాలకృష్ణ చేసుకున్న అదృష్టమిదే..
ఈ పురస్కారం బాలయ్యకు రావడం కాస్త ఆలస్యమైనప్పటికీ.. ఆ అవార్డుల విషయంలో నిజంగా బాలయ్య అదృష్టవంతుడని చెప్పుకోవాలి. అదెలా అంటే.. సరిగ్గా ఎనిమిదేళ్ల బాలుడిగా ఉన్నప్పుడు తండ్రి నందమూరి తారక రామారావు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న ఆ మహోన్నత క్షణాన్ని గర్వాంకిత హృదయంతో వీక్షించిన అతను (ఇప్పుడు బాలయ్య తనయుడు మోక్షజ్ఞది కూడా సేమ్ ఫీలింగ్), అదే కళామతల్లి సేవలో అకుంఠిత దీక్షతో, తండ్రి వేసిన బాటలో పయనించి, అత్యున్నతమైన పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ అపురూపమైన, భావోద్వేగభరితమైన శుభ సందర్భంలో, దివంగత తండ్రి తారకరాముడి సంప్రదాయ తెలుగు పంచెకట్టును సగర్వంగా ధరించి.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పట్ల తన అచంచలమైన గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
Also Read- Prakash Raj: పవన్ కళ్యాణ్‌కు అసలేం తెలియదు.. పుసుక్కున అలా అనేశాడేంటి? వీడియో వైరల్!
పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మాట్లాడుతూ.. ‘‘మొదట నా అభిమానులకు కృతజ్ఞతలు. ఎందుకంటే, వారు లేనిదే.. ఇవేవీ రావు, లేవు. నాకు చాలా సంతోషంగా ఉంది. భారత ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఈ అవార్డు ఎప్పుడో రావాల్సిందని నా అభిమానులు, శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు. వారందరికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే. నాకు సరైన సమయంలో, రావాల్సిన సమయంలోనే పద్మభూషణ్ వచ్చిందని నేను భావిస్తున్నాను. నేను ఈ మధ్య నటించిన నాలుగు సినిమాలు వరుసగా మంచి విజయాలు సాధించాయి. అలాగే, క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి 15 సంవత్సరాలు పూర్తయింది. ముఖ్యంగా నేను సినీ కెరీర్‌ను ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయింది. అందుకే ఈ అవార్డుకు ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. ఈ ఏడాది నాకు ఎంతో ప్రత్యేకం’’ బాలయ్య పేర్కొన్నారు.
Also Read- Pawan Kalyan: అజిత్ పేరు ప్రస్తావిస్తూ.. పద్మభూషణులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
మరోసారి ఇలాంటి ఘటనలు జరగకూడదు
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) స్పందిస్తూ.. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధిత కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను. అందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. మతాలకు, కులాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలి. మరోసారి ఇలాంటి దారుణమైన ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నాను. సాయుధ దళాల త్యాగాలకు వందనం చేయాలి. వారందరి కారణంగానే మనం ప్రశాంతంగా నిద్ర పోగలుగుతున్నాం. నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన వారికి, అవార్డుతో సత్కరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.
ప్రస్తుతం నందమూరి, అజిత్ అభిమానులను పట్టుకోవడానికి లేదు. అవార్డు అందుకున్న హీరోల కంటే కూడా వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయా హీరోల పేర్లతో సునామీని సృష్టిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య, అజిత్‌ల పేర్లు టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు