OTT Platforms: భారతీయ సినీ పరిశ్రమను గత కొన్నేళ్లుగా ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లు శాసిస్తున్నాయి. గతంలో సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత మాత్రమే డిజిటల్ మాధ్యమాల్లోకి వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అగ్రశ్రేణి హీరోల సినిమాలు సైతం నాలుగు వారాల స్వల్ప వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో, థియేటర్లలో సినిమా ఇంకా ఆడుతూ ఉండగానే, డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఓటీటీల డబుల్ స్టాండర్డ్ గేమ్ ప్లాన్
ఓటీటీ సంస్థలు అనుసరిస్తున్న వ్యూహం, పరోక్షంగా థియేటర్ల భవిష్యత్తుకు ముప్పుగా పరిణమిస్తోంది. వారి గేమ్ ప్లాన్ రెండు ప్రధాన మార్గాల్లో కొనసాగుతోంది. అవేంటంటే..
Also Read- Ravi Teja: హిట్టు లేదు.. కానీ మాస్ మహారాజాకు గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయంటే?
1. థియేటర్‌కు, ఓటీటీ విడుదలకు మధ్య ఉన్న సమయాన్ని తగ్గించడం ద్వారా, ప్రేక్షకులు సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరం తగ్గిపోయింది. ‘ఇంకొన్ని రోజులు ఆగితే ఇంట్లోనే చూసుకోవచ్చు’ అనే ఆలోచన ప్రేక్షకుల్లో స్థిరపడుతోంది. ఇది థియేటర్ల కలెక్షన్లపై, ముఖ్యంగా రెండో వారం తర్వాత, తీవ్ర ప్రభావం చూపుతోంది.
2. డైరెక్ట్-టు-ఓటీటీ నిర్మాణం: ఓటీటీ సంస్థలు ఇప్పుడు డిజిటల్ హక్కుల కోసం భారీగా కోట్లు ఖర్చు చేసే బదులు, ఒరిజినల్ కంటెంట్ పేరుతో సొంతంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించడం ప్రారంభించాయి. ఒక సినిమా డిజిటల్ హక్కుల కోసం పెట్టే కోట్లాది రూపాయలతో, ఆ ఓటీటీ సంస్థే రెండు లేదా మూడు నాణ్యమైన సినిమాలు లేదా సిరీస్‌లను స్వయంగా నిర్మించవచ్చని భావిస్తున్నాయి. ఈ ధోరణి వల్ల, భవిష్యత్తులో చాలా సినిమాలు థియేటర్‌ను కాదని డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదలయ్యే ప్రమాదం ఉంది.
Also Read- Jaanvi Ghattamaneni: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు.. మహేష్‌కు ఏమవుతుందో తెలుసా?
థియేటర్ల మనుగడపై ప్రభావం
ఈ పోకడ ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో థియేటర్లకు వచ్చే సినిమాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. చిన్న బడ్జెట్ సినిమాలు, మధ్యస్థాయి సినిమాలు థియేటర్ల కంటే ఓటీటీ రూట్‌నే సులభంగా ఎంచుకుంటాయి. చివరికి, ప్రేక్షకులు కేవలం అతి పెద్ద స్టార్ హీరోల గ్రాండియర్ సినిమాలు లేదా అద్భుతమైన విజువల్స్ ఉన్న సినిమాలను మాత్రమే థియేటర్‌లో చూడటానికి ఆసక్తి చూపే పరిస్థితి ఏర్పడుతుంది. మిగతా కంటెంట్ అంతా ఓటీటీకే పరిమితం అవుతుంది. ఈ పరిణామం వల్ల థియేటర్లను నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారి, చాలా థియేటర్లు మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు, థియేటర్లను కాపాడుకోవాలంటే, సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసికట్టుగా డిజిటల్ స్క్రీనింగ్ విషయంలో కఠినమైన నియమాలను తిరిగి అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే, ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని చూసేందుకే అలవాటు పడతారు. అప్పుడు థియేటర్లన్నీ కోళ్ల ఫారాలుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. థియేటర్లు లేకపోతే.. ఓటీటీ వాళ్ల పెట్టే సబ్‌స్క్రిప్షన్ చార్జెస్ ఏ రేంజ్‌లో ఉంటాయో కూడా ప్రేక్షకులు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
