Nenu Ready Teaser: యంగ్ హీరో హవిష్ (Havish), దర్శకుడు త్రినాధ రావు (Thrinadha Rao Nakkina) నక్కిన కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’ (Nenu Ready). హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్‌గా నటిస్తోంది. పోస్టర్లు, టైటిల్ గ్లింప్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్ర టీజర్‌ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌ను ఇంతకు ముందు ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్రంతో పాటు థియేటర్లలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. థియేటర్లలో మంచి స్పందనను అందుకున్న ఈ టీజర్, ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ అదే రేంజ్‌లో ఆదరణను రాబట్టుకుంటోంది. ఈ టీజర్‌ని గమనిస్తే..
Also Read- Manchu Manoj: రాకింగ్ స్టార్ ప్రారంభించిన సంక్రాంతి పండుగ సంబరాల క్యాంపెయిన్ వివరాలివే..
ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి
త్రినాధ రావు నక్కిన ఇతర సినిమాల్లానే ఒక ఎంటర్‌టైనింగ్ కథాంశాన్ని ఈ టీజర్ పరిచయం చేస్తుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే బాధ్యత గల మధ్యతరగతి ఆంధ్ర యువకుడికి, ఒక మధ్యతరగతి తెలంగాణ అమ్మాయితో నిశ్చితార్థం జరగడం, దానివల్ల కల్చర్, లైఫ్ స్టయిల్ మధ్య హిలేరియస్ కాన్ఫ్లిక్ట్‌కి దారితీయడం వంటిది చాలా ఆసక్తికరంగా చూపించారు. ‘రూ. 30 వేల జీతానికి ఇలాంటి దరిద్రపుగొట్టు జాబ్ ఎవడైనా చేస్తాడా?’ అనే డైలాగ్‌తో హీరో కష్టాలను పరిచయం చేశారు. త్రినాధ రావు నక్కిన మరోసారి కంప్లీట్ ఎంటర్టైనర్ రూపొందించడంలో తన మార్క్‌ని ప్రదర్శించారనే విషయం ఈ టీజర్ తెలియజేస్తుంది. అమ్మాయి కుటుంబం మాంసాహారాన్ని అమితంగా ఇష్టపడటం, అబ్బాయి కుటుంబం శాకాహారాన్ని పాటించడం.. వంటి సహజమైన పరిస్థితులతో ఇందులో హాస్యాన్ని పండించినట్లుగా అర్థమవుతోంది. ఇక లాస్ట్‌లో టైటిల్ జస్టిఫికేషన్ ఇస్తూ హీరో చెప్పిన డైలాగ్, ఆ తర్వాత పడే కౌంటర్ హిలేరియస్‌గా ఉన్నాయి.
Also Read- Allu Aravind: ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై మాస్టర్ మైండ్ స్పందనిదే..
కెమిస్ట్రీ అదిరింది
ఇందులో హవిష్ బాధ్యత గల మధ్యతరగతి కుర్రాడి పాత్రలో కనిపిస్తూ.., తన స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. కావ్య థాపర్ నైజాం అమ్మాయిగా ఆకట్టుకుంది. వారిద్దరి కెమిస్ట్రీ వావ్ అనేలా చూపించారు. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, VTV గణేష్ వంటి హాస్య నటులు ఉండటంతో.. ఈ చిత్రం నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తుందనేలా ఈ టీజర్ ప్రామిస్ చేస్తోంది. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకోగా, సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ మరోసారి తన ప్రతిభను కనబరిచారు. ఈ టీజర్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ మంచి అంచనాలను పెంచేసింది. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలను తెలియజేస్తామని, ఈ సినిమాను 2026 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

