Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో.. ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణనే. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్‌లో స్థానం కల్పించినట్టుగా సీఈవో సంతోష్ శుక్లా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (World Book Records Felicitation) సంస్థ బాలకృష్ణను ఘనంగా సత్కరించింది. ఈ మేరకు శనివారం (ఆగస్ట్ 30) నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్, సహజ నటి జయసుధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర పరిశ్రమలోని దర్శక, నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ తెలంగాణ రాష్ట్రంలో వరదలకు అతలాకుతలం అయిన ప్రాంతాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి యాభై లక్షల ఆర్థిక విరాళాన్ని ప్రకటించారు.
Also Read- 50 Years Of NBK: బాలయ్య వంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు
మనవళ్లు కూడా బాలా అనే పిలుస్తారు
ఇంకా ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నాకు ఇంతటి ధన్యమైన జన్మను ఇచ్చిన దైవాంశ సంభూతుడు, నా గురువు, నా దైవం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, కళా ప్రపూర్ణ, నట రత్న, పద్మశ్రీ నందమూరి తారక రామారావు, నా తల్లి బసవతారకంలకు ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. నాది చాలా పెద్ద కుటుంబం. హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు, తెలుగు చిత్ర సీమలోని శ్రేయోభిలాషులు ఇలా నాది చాలా పెద్ద కుటుంబం. నేను సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణాన్ని పూర్తి చేశాను. నాకు ఈ లెక్కలన్నీ సరిగ్గా గుర్తుండవు. ఆ అంకెలన్నీ కూడా అభిమానులే గుర్తు పెట్టుకుంటారు. నా మనవళ్లు కూడా నన్ను బాలా అనే పిలుస్తుంటారు. నటుడిగా మా నాన్నే నాకు స్పూర్తి. రాజకీయాల్లోకి రాక ముందే ప్రజా సేవ చేసేవారు. వరదల సమయంలో ముందుండి సాయం చేసేవారు. ప్రాంతాలు వేరైనా సరే ఎన్నో విపత్కర పరిస్థితుల్లో ఆయన సేవా కార్యక్రమాలు చేశారు. అందరి సహాయ సహకారాలతోనే క్యాన్సర్ హాస్పిటల్‌ను నడిపిస్తున్నాను.
Also Read- 50 Years for Balakrishna: కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా! ఈ డైలాగ్ రజినీకాంత్ చెబితే!
చాలా ఆనందంగా ఉంది
సినిమా అనేది బలమైన మాధ్యమం. నా దర్శక, నిర్మాతల సహకారంతోనే ఈ స్థాయికి చేరాను. ఏపీలోనూ ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ది చేయాలని కోరుకుంటున్నా. తెలంగాణ, ఏపీలోనూ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. కళకి ఎప్పుడూ భాషా బేధం, లింగ బేధం అనేవి ఉండవు. మన తెలుగు సినిమా ఇప్పుడు ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ఇది మన తెలుగు వారంతా గర్వించదగ్గ విషయం. ఈ రోజు నాకు ఇలా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. నేను 13 ఏళ్ల వయసులోనే ‘తాతమ్మ కల’ మూవీ చేశాను. గత ఐదు దశాబ్దాల్లో నేను ఎన్నో జానర్లలో, ఎన్నెన్నో పాత్రలను పోషించాను. ‘ఆదిత్య 369’ అనేది ఇండియాలో మొట్ట మొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రం. 50 ఏళ్లలో 110 చిత్రాలు చేశాను. నేను చిత్ర సీమకు చేసిన సేవకు ఈ గుర్తింపు దక్కడం ఆనందంగా ఉంది. నాకు విషెస్ అందించిన అమితాబ్, రజినీకాంత్‌లకు ధన్యవాదాలు. అభిమానుల ప్రేమ వల్లే ఈ విజయాల్ని, రికార్డుల్ని సాధించాను. ఇదే ఉత్సాహం, ప్యాషన్‌తో ముందుకు సాగుతానని మాటిస్తున్నా. ఇటీవల తెలంగాణలో వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాలలో సహాయక చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు