Nagabandham: యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో అభిషేక్ నామా (Abhishek Nama) దర్శకత్వంలో NIK స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి నిర్మిస్తోన్న పాన్-ఇండియా చిత్రం ‘నాగబంధం’. లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్న ఈ చిత్ర ప్రీ-లుక్, ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకొన్న విషయం తెలిసిందే. విరాట్ కర్ణ ఈ సినిమాలోని పాత్ర కోసం పూర్తిగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. వైల్డ్ అవతార్‌లో కనిపించిన అతని జిమ్ ఫోటోలు ఇప్పటికే వైరల్ అవడమే కాకుండా.. సినిమా కోసం అతని అంకితభావాన్ని తెలియజేశాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలోని కీలకమైన సన్నివేశాన్ని, అలాగే ఓ పాటను చిత్రీకరించేందుకు భారీ సెట్‌ను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
Also Read- Ye Maaya Chesave : నాగ చైతన్యతో కలిసి సమంత మూవీ ప్రమోషన్స్? ఫ్యాన్స్ కోరిక నెరవేరుతోందా?
ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సెట్ ఏంటో తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఆ సెట్ ఏదో కాదు.. అనంత పద్మనాభ స్వామి ఆలయం సెట్ (Anantha Padmanabha Swamy Temple Set). అత్యద్భుతంగా నిర్మించిన ఈ సెట్‌ను సందర్శించి మీడియా కూడా సర్ ప్రైజ్ అయింది. కేరళలోని అసలు దేవాలయానికి కచ్చితమైన ప్రతిరూపంగా కనిపిస్తోందని ఈ సెట్‌కి వెళ్లిన వారంతా ప్రశంసలు కురిపిస్తుండటం విశేషం. ఇక ఈ సెట్‌లో చిత్రీకరించే పాట.. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య (Ganesh Acharya) పర్యవేక్షణలో విరాట్ కర్ణతో పాటు 5000 మంది నృత్యకారులు పాల్గొంటున్నారని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ అద్భుతమైన సీక్వెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా వుంటుందని చిత్ర బృందం తెలుపుతోంది. అంతే కాదు, ఇందులో చిత్రీకరించే ఒక్క సన్నివేశానికే దాదాపు రూ. 10 కోట్లు బడ్జెట్ కేటాయించారట. ఇప్పుడిదే ఈ సినిమాను వార్తలలో నిలుపుతోంది.
Also Read- Uttar Pradesh News: ప్రియుడి కోసం వెళ్లిన భార్య.. వెంటాడి ముక్కు కొరికేసిన భర్త.. ఎక్కడంటే?
‘నాగబంధం’ సినిమా విజువల్‌గా అద్భుతంగా ఉంటుందని, ఈ ఎపిసోడ్ కోసం వేసిన భారీ సెట్, అంతే స్థాయిలో నిర్మాణం టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారుతుందని మేకర్స్ చెబుతున్నారు. నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్ అవినాష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రూపుదిద్దుకున్న ఈ ‘నాగబంధం’ మూవీ.. పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్న కథాంశాన్ని మిళితం చేస్తూ పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో వుంటుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. ఈ పవిత్ర స్థలాలను రక్షించే నాగబంధం పురాతన ఆచారాలపై దృష్టి సారించి, భారతదేశంలోని విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ప్రజెంట్ చేస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి అభే సంగీతం అందిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు