Mohan Babu: మోహన్ బాబు.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఈ మధ్య సరైన హిట్ పడటం లేదు కానీ, ఒకప్పుడు కలెక్షన్ కింగ్‌గా ఆయనకు పేరుంది. ఆయన 50 సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో మరుపురాని హిట్స్ ఉన్నాయి. ఇక నటుడిగానే కాకుండా విద్యావేత్తగా కూడా ఆయన మంచి పేరును గడించారు. అలాంటి మోహన్ బాబు (Mohan Babu)ను ఇప్పుడు ప్రతిష్టాత్మక అవార్డ్ వరించింది. ఇప్పటి వరకు తెలుగులో ఏ నటుడికి లేని విధంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మోహన్ బాబుని గౌరవించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న కోల్‌కత్తాలోని లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ (West Bengal) ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్‌ను (Governor’s Award of Excellence) లెజెండరీ యాక్టర్ డా. ఎం. మోహన్ బాబు అందుకున్నారు.
Also Read- Barabar Premistha: ‘మళ్లీ మళ్లీ’.. ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి మాంచి రొమాంటిక్ ట్రాక్ వదిలారు
తెలుగు నటుడికి అరుదైన గౌరవం
డా. మోహన్ బాబుకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఈ అవార్డును విశిష్ట అతిథుల సమక్షంలో ప్రదానం చేశారు. ఈ అవార్డు ప్రధానోత్సవం అనంతరం సాంప్రదాయ ఎట్ హోమ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు కుమారుడు, ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు (Vishnu Manchu), ‘మా’ కోశాధికారి శివ బాలాజీ (Siva Balaji) కూడా పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం భారతదేశం అంతటా తెలుగు సినిమా ప్రభంజనం కనిపిస్తోంది. ‘బాహుబలి’ చిత్రం నుంచి భారతీయ సినిమా అంటే టాలీవుడ్ అనేలా మారిపోయింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక తెలుగు నటుడికి ఇటువంటి గౌరవాన్ని ప్రదానం చేయడం ఓ ప్రత్యేక చరిత్రను సృష్టించినట్టుగా చెప్పుకోవచ్చు. మోహన్ బాబు 50 సంవత్సరాల సినీ జీవితంలో కళామతల్లికి చేసిన సేవ, అట్టడుగు స్థాయి నుండి భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదగడం, విద్య, దాతృత్వంలో సమాజంపై చెరగని ముద్ర వేయడం వంటి గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినీ, వ్యక్తిగత జీవితం, పాటించే క్రమశిక్షణ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది.
Also Read- Akira Nandan: అకీరా నందన్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పు.. వారికి నోటీసులు!
ఇండస్ట్రీ నుంచి అభినందనల వర్షం
మోహన్ బాబు ఈ అవార్డును అందుకున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజానికి ఈ క్షణం గర్వకారణంగా మారుతుంది. ఎందుకంటే.. ఒకప్పుడు తెలుగు సినిమా అన్నా, తెలుగు నటులున్నా చాలా చులకనగా చూసేశారు. కానీ ఈ మధ్య అంతా మారిపోయింది. కళకు, కళాకారులకు హద్దులు ఉండవని, భాషా సరిహద్దులు ఉండవని, అంతా ఒక్కటే అనే గణతంత్ర దినోత్సవ సారాంశాన్ని ఈ కార్యక్రమం మరోసారి చాటి చెప్పింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గవర్నర్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్‌ను అందుకున్న సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. మోహన్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా ‘ది ప్యారడైజ్’లో ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోని ఆయన లుక్‌ని ఇటీవలే రిలీజ్ చేయగా, అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

