Chennai Love Story: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో సెన్షేషన్ అనే విషయం తెలియంది కాదు. చిన్న హీరోగా మొదలైన కిరణ్ అబ్బవరం, వరసగా విజయాలు అందుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును అందుకుంటున్నారు. త్వరలోనే ఆయనకు స్టార్‌డమ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ‘క’ (Ka Movie) సినిమా తర్వాత ఆయన రేంజే మారిపోయింది. తక్కువ బడ్జెట్‌తో చేసిన ‘క’ చిత్రం ఊహించని సక్సెస్‌తో భారీ లాభాలను రాబట్టింది. అప్పటి నుంచి కిరణ్ అబ్బవరం పేరు టాలీవుడ్‌లో మారుమోగుతోంది. ‘క’ తర్వాత వచ్చిన సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయినా, రీసెంట్‌గా వచ్చిన ‘కె ర్యాంప్’తో మళ్లీ సక్సెస్ కొట్టి.. తనేంటో నిరూపించుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు తన తదుపరి సినిమాపై ఆయన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ‘కె ర్యాంప్’ (K Ramp) తర్వాత కిరణ్ చేస్తున్న సినిమాకు సంబంధించి తాజాగా అప్డేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
బర్త్ డే స్పెషల్‌గా..
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా.. ‘కలర్ ఫొటో’, ‘బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్‌ను ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story). ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై సాయి రాజేశ్, ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రం.. రవి నంబూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదల చేయడానికి కారణం ఏంటంటే.. హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ పుట్టినరోజు (HBD Sri Gouri Priya). ఆమె బర్త్ డేను పురస్కరించుకుని, శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఈ పోస్టర్ వదిలారు.
Also Read- Prakash Raj: ‘తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే’.. ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు
లైట్‌హౌస్ ఎదురుగా
ఈ పోస్టర్‌ని గమనిస్తే.. మాములుగా బర్త్‌డే అంటే హీరోయిన్ పిక్ ఒక్కటే వదులుతారు. కానీ ఈ పోస్టర్‌లో బ్యూటిఫుల్ లవ్ పెయిర్‌గా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ కలిసి ఉన్న పిక్ వదిలారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకోబోతుందనేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు. వైజాగ్ లైట్‌హౌస్ ఎదురుగా నిలబడి.. తన ప్రియురాలిగా బన్ ఇస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఇది పుట్టినరోజు సందర్భమా, లేదంటే ప్రేమికుల రోజు సందర్భమా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సందర్భం ఏదైనా.. ఇద్దరి కళ్లలో ప్రేమ ఆకర్షిస్తోందనే చెప్పుకోవాలి. ఈ మూవీలో నివి (Nivi) పాత్రలో శ్రీ గౌరి ప్రియ ప్రేక్షకులకు మరింత చేరువకానుందని, మెలొడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుందని మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
