Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), ‘కెజియఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) పై కొన్ని రోజులుగా భారీ స్థాయిలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా దర్శకుడు, హీరో మధ్య క్రియేటివ్ విభేదాలు తలెత్తాయని, అవుట్ పుట్ సంతృప్తికరంగా లేకపోవడంతో సినిమా షూటింగ్ పూర్తిగా ఆగిపోయిందని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. ‘దేవర’ (Devara), ‘వార్ 2’ (War 2) వంటి సినిమాల తర్వాత ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ అభిమానులు (Jr NTR Fans) భారీ ఆశలు పెట్టుకున్న తరుణంలో ఈ వార్తలు వారిలో ఆందోళన కలిగించాయి. ఈ పుకార్లకు చెక్ పెడుతూ దర్శకుడు ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి నీల్ సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు. తాజాగా ఒక నెటిజన్ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డ్రాగన్’ సినిమా అప్డేట్ ఇవ్వాలని అడగగా, ఆమె తెలివిగా ‘సరైన సమయంలో వస్తుంది (Will come at the right time)’ అని రిప్లయ్ ఇచ్చారు. లిఖితా రెడ్డి ఇచ్చిన ఈ ఒక్క సమాధానం, సినిమా ఆగిపోయిందనే ప్రచారానికి ఫుల్ స్టాఫ్ పెట్టినట్లయింది.
Also Read- SKN: 100 కోట్ల క్లబ్‌లోకి ‘డ్యూడ్’.. ప్రదీప్‌కు ఆ హీరోల రేంజ్ ఇచ్చిన ఎస్కేఎన్..
అసలు విషయం ఏమిటంటే?
చిత్ర వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘డ్రాగన్’ ప్రాజెక్ట్ అనుకున్న విధంగానే ముందుకు సాగుతోందని తెలుస్తోంది. నిజానికి, ప్రశాంత్ నీల్‌కు ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత, అవుట్‌పుట్‌ను నిశితంగా పరిశీలించి, స్క్రిప్ట్‌లో అవసరమైన మెరుగుదలలు చేయడం అలవాటు. ‘కెజియఫ్’, ‘సలార్’ సినిమాల విషయంలో కూడా ఆయన ఇదే పద్ధతిని అనుసరించారు. ప్రస్తుతం ‘డ్రాగన్’ కోసం కూడా దర్శకుడు స్క్రిప్ట్ మెరుగుదల, నటీనటుల రిహార్సల్స్, అంతర్జాతీయ లొకేషన్ల వేటలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా యొక్క భారీ స్కేల్‌కు, కథకు మరింత బలాన్ని చేకూర్చేందుకు ఈ గ్యాప్ తీసుకున్నారని, ఇది ‘బ్రేక్’ కాదు, తదుపరి భారీ షెడ్యూల్‌కు సన్నాహం మాత్రమేనని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
నిశ్శబ్దం అందుకేనా..
మరోవైపు సినిమాపై ఉన్న భారీ హైప్‌ని కాస్త తగ్గించాలనే, సినిమా అనుకున్న టైమ్ కంటే, చిత్రీకరణకు ఇంకా ఎక్కువ టైమ్ తీసుకునే అవకాశం ఉండటంతో.. ఫ్యాన్స్ భారీగా ఆశిస్తారని భావించి టీమ్ కావాలనే ఇలా చేస్తుందనేలా కూడా వినిపిస్తుంది. ఏదైతేనేం.. సినిమా అయితే ఆగిపోలేదు. ఇది చాలు ఫ్యాన్స్‌కి. ప్రస్తుతం నెలకొన్ని నిశ్శబ్దం, ఆశించిన స్థాయికి మించి ప్రేక్షకులను మెప్పించడానికి ఈ సినిమా సిద్ధమవుతోందనడానికి సంకేతం అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో మరింతగా హంగామా మొదలుకానుందనేలా టాక్ నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
