iBomma Ravi: ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)కి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. అయిదు కేసుల్లో అతను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది. దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్ విసిరిన రవిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలియంది కాదు. విచారణలో వెల్లడైన వివరాల నేపథ్యంలో రవి (iBomma Ravi)పై అయిదు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ రవి నాంపల్లి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అతని తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. ఇప్పటికే రెండుసార్లు పోలీసులు రవిని కస్టడీకి తీసుకుని విచారణ జరిపినట్టు తెలిపారు. ఈ క్రమంలో అన్ని వివరాలను తీసుకున్నారన్నారు. ఇకపై విచారణ జరిపే అవసరం లేదంటూ రవికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కానీ కోర్టు ఆయన పిటిషన్లను కొట్టివేసింది.. అందుకు కారణం ఏమిటంటే..
Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బెనిఫిట్ షో టికెట్ ధర వింటే షాకే!
మరోసారి షాక్
ఈ కేసులో ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేసులో ఇంకా విచారణ జరపాల్సి ఉందని కోర్టుకు చెప్పారు. రవి విదేశీ పౌరసత్వం కలిగి ఉన్నాడని తెలిపారు. బెయిల్ పై విడుదల చేస్తే అతను విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, అదే జరిగితే విషయం మళ్లీ మొదటికి వస్తుంది కాబట్టి.. దీనిని దృష్టిలో పెట్టుకుని రవికి బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు రవి దాఖలు చేసుకున్న బెయిల్ (Bail) పిటిషన్లను కొట్టి వేసింది. దీంతో మరోసారి ఆయనకు షాక్ తగిలినట్లయింది. పైరసీతో సినీ ఇండస్ట్రీ కుదేల్ అయ్యేలా చేయడమే కాకుండా.. పోలీసులకు సవాల్ విసిరిన రవికి ఇదే సరైన ట్రీట్‌మెంట్ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా టాక్ వినిపిస్తుండటం విశేషం.
వారికి రవితో ఎలాంటి సంబంధాలు లేవు
ఇప్పటికే రవిని రెండుసార్లు కస్టడీకి తీసుకున్న సైబర్ క్రైం పోలీసులు విచారణలో చాలా విషయాలను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ విచారణకు సంబంధించి రీసెంట్‌గా సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు.. ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకుని విచారణ చేశామని, కొన్ని ఫేక్ ఐడీలను సేకరించామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘గతంలో ఐబొమ్మ రవికి తెలిసిన ముగ్గురు స్నేహితుల ఐడీల ద్వారానే ఫేక్ ఐడీలు సృష్టించాడు. ఈ విచారణలో రవికి చెందిన రూ. 3 కోట్లు ఫ్రీజ్ చేశాము. అతనికి బెట్టింగ్ యాప్స్‌తో ఉన్న సంబంధాలు.. ఆర్థిక లావాదేవీలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఇతర పైరసీ వెబ్‌సైట్స్‌తో రవికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నాం. కరేబియన్ దేశంలో ఉన్న రవి డేటాని కూడా రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రవి ప్రహ్లాద్, మరో ఇద్దరు స్నేహితులకు ఐబొమ్మ రవితో ఎలాంటి సంబంధాలు లేవు. వారికి తెలియకుండానే వారి డాక్యుమెంట్స్ తస్కరించి పైరసీ వ్యవహారాన్ని నడిపించాడు’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

