Honey Glimpse: టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర (Naveen Chandra). వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోన్న నవీన్ చంద్ర, ఈసారి అందరినీ భయపెట్టించేలా ఓ సైకలాజికల్ హారర్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా పేరే ‘హనీ’ (Honey). ‘పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్’ వంటి సినిమాలతో తన మార్క్ క్రియేట్ చేసిన దర్శకుడు కరుణ కుమార్ (Karuna Kumar) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read- Vishwak Sen: విశ్వక్ సేన్ నెక్ట్స్ ఫిల్మ్ టైటిల్ ఇదే.. అనౌన్స్‌మెంట్ టీజర్ అదిరింది
నవీన్ చంద్ర షాకింగ్ లుక్!
ఈ గ్లింప్స్ (Honey Glimpse) ప్రారంభమే చాలా భయంకరమైన వాతావరణంతో మొదలైంది. పిల్లుల అరుపులు, చీకటి గదులు, భయపెట్టే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో హారర్ టోన్ సెట్ చేశారు. ముఖ్యంగా నవీన్ చంద్ర లుక్ చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. గ్లింప్స్ చివరిలో ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇస్తోంది. ఒక సైకలాజికల్ హారర్ చిత్రానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయనేది ఈ గ్లింప్స్ తెలియజేస్తుంది. ‘హనీ’ సినిమా కేవలం ఊహాజనిత కథ కాదని మేకర్స్ చెబుతున్నారు. సమాజంలో నేటికీ వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని, నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు కరుణ కుమార్ ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
Also Read- Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్.. ఆ సినిమాలు డౌటే!
ఫిబ్రవరి 6న గ్రాండ్ రిలీజ్
మనిషిలోని అత్యాశ, చీకటి కోణాలు ఎలా విపరీత పరిణామాలకు దారితీస్తాయనేది ఈ సినిమాలో బోల్డ్‌గా చూపించబోతున్నారు. ఈ చిత్రానికి అజయ్ అరసాడ అందిస్తున్న నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గ్లింప్స్‌లో వినిపించిన మ్యూజిక్ సినిమా మూడ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, నగేష్ బన్నెల్ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ అండ్ డార్క్ లుక్‌ని తీసుకొచ్చాయి. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. థియేటర్లలోకి రాకముందే ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. అందుకే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా మేకర్స్ తెలిపారు. నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్, కరుణ కుమార్ టేకింగ్‌తో ‘హనీ’ ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమైంది. హారర్ ప్రేమికులకు ఫీస్ట్‌లా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

