Hema Pothana: రంగుల ప్రపంచంలోకి దూసుకొచ్చిన యువనటి హేమ పోతన సినీ ప్రయాణం… కేవలం గ్లామర్ కథ కాదు, అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో దాటిన ఓ పోరాట గాథ. అందం, అభినయంతో సినీ రంగంలో తనకంటూ ఒక బంగారు భవిష్యత్తును నిర్మించుకుంటున్న ఈ తార, చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయినా, ఆ దుఃఖాన్ని తట్టుకుని నిలబడింది. ఆ లోటును తన బలంగా మార్చుకుని, జీవితాన్ని స్వయంగా తీర్చిదిద్దుకుంది. విజయవాడకు చెందిన హేమ, చిన్నప్పటి నుంచే జిజ్ఞాస, ధైర్యం అనే విలువలను ఒంటబట్టించుకుంది. “నా జీవితాన్ని నేను నిర్మించుకుంటాను” అనే స్పష్టమైన సంకల్పంతో హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఆమె ధైర్యమే 2013లో మిస్ హైదరాబాద్ కిరీటాన్ని దక్కేలా చేసింది. ఈ విజయం ఆమె సినీ ప్రయాణానికి తొలి మెట్టు.
Read also-Ravi Teja: రవితేజ, శివ నిర్వాణ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ఆ యంగ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
సినిమాలపై మక్కువతో టాలీవుడ్‌లో ప్రవేశించిన హేమ, ‘100% లవ్’, ‘చలాకీ’, ‘కాఫీబార్’, ‘రాజ్’ వంటి చిత్రాలలో నటించి తన నటన ప్రతిభను చాటుకుంది. అయితే, ఆమె కెరీర్‌లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం పెద్ద మలుపు. డాక్టర్లు కూడా చేతులెత్తేసేంత తీవ్రంగా గాయపడినా, హేమ ఓడిపోలేదు. పట్టుదలతో మళ్లీ కోలుకుంది, నిలబడింది. ఆ ప్రమాదం ఆమెను నిలువరించలేదు – మరింత శక్తివంతురాలిని చేసింది.
Read also-Annagaaru Vastaaru: కార్తి ‘అన్నగారు వస్తారు’ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?..
ప్రస్తుతం హేమ ‘మదం’ అనే గ్రామీణ నేపథ్య చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. భావోద్వేగాలు, నటనకు విపరీతమైన స్కోప్ ఉన్న ఈ సినిమాతో తన ప్రతిభను మరో మెట్టుకు తీసుకెళ్లాలనేది ఆమె లక్ష్యం. సినీ ఇండస్ట్రీలో ఏ గాడ్‌ఫాదర్ అండ లేకపోయినా, తన ఆత్మవిశ్వాసం, పట్టుదల, కష్టపడే స్వభావమే ఆమెకు వరుస అవకాశాలు దక్కేలా చేశాయి. హేమ పోతన ప్రయాణం… సినిమాను మించిన కథగా, పట్టుదలతో కొనసాగుతోన్న విజయంగా నిలుస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన లిరికల్ వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.

