Harish Shankar: సుచీ లీక్స్ తెలుసు, చిరు లీక్స్ తెలుసు.. కొత్తగా హరీష్ శంకర్ లీక్స్ ఏమిటని అనుకుంటున్నారా? దర్శకుడు హరీష్ శంకరే స్వయంగా ‘హరీష్ శంకర్ లీక్స్’ అంటూ తన సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశాన్ని లీక్ చేశారు. ఆదివారం జరిగిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ ప్రీ రిలీజ్ వేడుకలో హరీష్ శంకర్ తను చేస్తున్న సినిమాలోని ఓ సన్నివేశాన్ని లీక్ చేశారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్, ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) కాంబోలో వచ్చిన ‘లవ్ టుడే’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్‌లో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) పేరుతో రూపుదిద్దుకున్న చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ వంటి వారు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. విక్టరీ వెంకటేష్, విశ్వక్ సేన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓరి దేవుడా’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం, హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read: Sreeleela: బాలీవుడ్ వెళ్లగానే ఆ ముద్దులేంటి శ్రీలీల?
ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమాలోని ఓ సన్నివేశాన్ని లీక్ చేశారు. అంతకు ముందు హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. తను పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానినని, ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం.. ఆ రోజు కారు టాప్‌పై ఆయన ప్రయాణించిన సన్నివేశాన్ని రీ క్రియేట్ చేస్తానని చెప్పారు. ఆ సన్నివేశం రియల్‌గానే హీరోయిక్‌గా ఉంటుందనేలా ప్రదీప్ రంగనాథన్ చెప్పగా.. అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు అంటూ హరీష్ శంకర్, ప్రదీప్ డ్రీమ్‌కు బ్రేక్ వేశారు. దీనిపై వివరణ ఇస్తూ.. ఆ సీన్‌ని నేను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో వాడేశాను. దయచేసి దాని గురించి ఇక ఆలోచించ వద్దు అంటూ.. మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి.. హరీష్ శంకర్ లీక్స్ అని రాసుకుండి. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో కారు టాప్‌పై కూర్చుని ప్రయాణం చేసే సీన్ ఉంటుంది అని హరీష్ చెప్పుకొచ్చారు.
కారు టాప్‌పై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సీన్ విషయానికి వస్తే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో అక్కడి ప్రజల ఇళ్లు కూలగొడుతున్నారని తెలిసి, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయం నుండి కాన్వాయ్‌లో ఇప్పటం గ్రామానికి బయలుదేరగా, మధ్యలోనే పోలీసులు ఆపేశారు. అనుమతి లేదంటూ పవన్‌ని, ఆయన వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో పవన్ కళ్యాణ్ దాదాపు మూడు కిలో మీటర్ల వరకు నడుచుకుంటూ ముందుకు సాగారు. అనంతరం కారు పైకి ఎక్కి కూర్చుని ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. ఆ కారుపైకి ఎక్కి కూర్చుని, ప్రయాణించిన విజువల్స్ ఇప్పటికీ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడా సీన్‌నే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో రీ క్రియేట్ చేశానని హరీష్ శంకర్ లీక్ చేశారు.

ఇంకా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ గురించి హరీష్ శంకర్ మాట్లాడుతూ.. నేను అసలు ఊహించలేదు.. ప్రదీప్ రంగనాథన్ తెలుగులో చాలా అద్భుతంగా మాట్లాడారు. ఒక్కసారి హీరోని మనం సొంతం చేసుకుంటే.. ఆ హీరో ఏం చేసినా మనకు నచ్చేస్తుంది. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ కూడా అలాంటి ఇమేజ్‌నే టాలీవుడ్‌లోనూ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రదీప్‌కి నేను చెప్పేది ఏమిటంటే.. సినిమా సినిమాకు గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో ఎప్పుడూ ప్రేక్షకులలో ఉండాలని కోరుకుంటున్నాను. అశ్వత్ మారిముత్తు కూడా తెలుగువాళ్లకి పరిచయమే. దర్శకుడిగా తనేంటో ఇప్పటికే ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ కట్ చూశాను.. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్ చాలా బాగా రాశారు. ఫిబ్రవరి 21న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని అన్నారు.