Kapil Sharma Cafe: భారతీయ పాపులర్ స్టాండ్-అప్ కామెడీ ఆర్టిస్ట్, టీవీ హోస్ట్, నటుడు కపిల్ శర్మ ఇటీవల కెనడాలో ‘కప్స్ కేఫ్’ (Kaps Cafe) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడా కేఫ్‌పై మరోసారి కాల్పుల మోత మోగింది. ఈ కేఫ్‌ని ప్రారంభించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఖలిస్థానీ ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ కాల్పుల జరిపారు. మళ్లీ నెల రోజుల వ్యవధిలోనే కాల్పులు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గురువారం ఉదయం కెనడాలోని సర్రేలో ఉన్న కేఫ్‌పై కొంతమంది గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ కాల్పులకు సంబంధించి ఆరు బుల్లెట్ రంధ్రాలు, ధ్వంసమైన కిటికీ, సామాగ్రిలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్రే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కాల్పుల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడికి తెగబడింది మేమే అంటూ గుర్‌ప్రీత్ సింగ్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi Gang) ప్రకటించినట్లుగా తెలుస్తోంది. సదరు కేఫ్‌పై సుమారు 25 రౌండ్లు కాల్పులు జరిగాయని అక్కడి స్థానికులు చెబుతుండటం విశేషం.
Also Read- Bharadwaja Thammareddy: సాఫ్ట్‌వేర్ వాళ్లతో సినీ కార్మికులను పోల్చవద్దు..
కాల్పులు జరిగిన కొద్దిసేపటికే స్థానిక నివాసి ఒకరు న్యూస్ రేడియోకు కాల్ చేసి చెప్పాడట. మా డాబాపై నుంచి ఈ కాల్పులను చూశానని, ఐదు నుంచి ఆరు రౌండ్ల వరకు కాల్పుల శబ్దాన్ని గమనించానని తెలిపారట. ఆ కాసేపటికే అక్కడకు పోలీసులు చేరుకున్నట్లుగా వివరించారు. కాల్పుల సంఘటన అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారని, కాల్పుల సంఘటన వెనుక ఉన్న దుండగుల గుర్తింపును నిర్ధారించడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. మొదటి నుంచి కపిల్ శర్మను బెదిరిస్తున్న లారెన్స్ గ్యాంగ్, కాల్పుల సంఘటన జరిగిన కొన్ని నిమిషాల తర్వాత, కపిల్ శర్మను మళ్ళీ బెదిరించిందని.. తదుపరి లక్ష్యం కెనడా కాదని, ముంబై అని హెచ్చరించినట్లుగా సమాచారం. సర్రేలోని కపిల్ శర్మ కాప్స్ కేఫ్‌లో జరిగిన కాల్పులకు గోల్డీ ధిల్లాన్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లుగా ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో.. ‘‘మేము అతనికి ఫోన్ చేశాము, కానీ అతను రిసీవ్ చేయలేదు. అందుకే దాడి చేశాం. మా హెచ్చరికలను కనుక పట్టించుకోకపోతే.. ఈసారి దాడి ముంబైలో చేస్తాం’’ అని హెచ్చరించినట్లుగా ఉంది.
Also Read- TG Vishwa Prasad: నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు.. నిర్మాత వివరణ
సోషల్ మీడియాలో వచ్చిన ఈ బెదిరింపుపై ముంబై పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు. పోలీసులు ఈ పోస్ట్‌ను ధృవీకరిస్తూ.. భద్రతలను కట్టుదిట్టం చేసేలా ప్రయత్నాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడులకు కారణం మాత్రం గతంలో కపిల్ శర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలే కారణమని, అందుకే వారు ఇలా దాడులు చేస్తున్నారనేలా ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు