Sandeep Raj: ‘కలర్ ఫొటో’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాన్ని అందించిన యువ దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj).. తాజాగా చేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. తాను రూపొందించిన చిత్రాల విడుదలకు ఎదురవుతున్న అవాంతరాలపై తీవ్ర నిరాశకు లోనైన ఆయన, తననే ‘బ్యాడ్ లక్’గా అభివర్ణించుకుంటూ చేసిన వ్యాఖ్యలు కలచివేస్తున్నాయి. ‘మోగ్లీ 2025’ సినిమా విడుదల విషయంలో ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలియంది కాదు. ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడి, డిసెంబర్ 12న విడుదల అనుకుంటున్న సమయంలో ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రం విషయంలో ఏర్పడిన గందరగోళంతో ‘మోగ్లీ 2025’ (Mowgli 2025) టీమ్ అంతా నిరాశలో ఉంది. అందుకే.. ఆయన తన మనసులోని ఆవేదనను తెలియజేస్తూ.. ‘కలర్ ఫొటో’, ‘మోగ్లీ’ చిత్రాలకు బహుశా నాకంటే మరొక దర్శకుడు అర్హులేమో. ఈ సినిమాలు తమ వృత్తి కోసం ఎంతైనా చేయగల ఉద్వేగభరితమైన టీమ్‌తో రూపొందించబడ్డాయని పేర్కొన్నారు.
Also Read- Jayasudha: అప్పుడే ఎవరికీ తలవంచలేదు.. పవన్ కళ్యాణ్‌పై జయసుధ సంచలన కామెంట్స్!
సిల్వర్ స్క్రీన్‌కి నేను నచ్చలేదు
తన చిత్రాల విడుదలకు చివరి నిమిషంలో ఎదురవుతున్న అడ్డంకులను ప్రస్తావిస్తూ… ‘ఈ రెండు చిత్రాలకు ఉన్న ఉమ్మడి అంశాలు: 1. అన్నీ బాగానే ఉన్నాయనుకున్నప్పుడు విడుదలలో బ్యాడ్ లక్ ఎదురవడం. 2. నేను’ అంటూ సందీప్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘బహుశా నేనే ఆ బ్యాడ్ లక్ నేమో. నాకు కూడా అలాగే అనిపించడం మొదలైంది. ‘డైరెక్టెడ్ బై సందీప్ రాజ్’ అనే టైటిల్ పెద్ద స్క్రీన్‌పై చూసే నా కల రోజురోజుకూ కష్టమవుతోంది. సిల్వర్‌స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందని నేను అనుకుంటున్నాను’’ అంటూ తన నిరాశను పంచుకున్నారు. ‘మోగ్లీ’ చిత్రం రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, డీఓపీ మారుతి, భైరవ వంటి అనేక మంది అంకితభావం గల వ్యక్తుల చెమట, రక్తం, అభిరుచితో రూపొందిందని, వారి కోసమైనా ‘మోగ్లీ 2025’కి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సందీప్ రాజ్ తన ట్వీట్‌లో తెలిపారు.
Also Read- Maruthi: జపాన్‌లో ప్రభాస్ క్షేమంగా ఉన్నాడు.. డోంట్ వర్రీ.. అభిమాని ట్వీట్‌పై మారుతి!
ధైర్యం చెప్పిన మెగా హీరో
సందీప్ రాజ్ ట్వీట్ పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సానుభూతి, మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో, మెగా హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) స్పందిస్తూ యువ దర్శకుడికి ధైర్యం చెప్పారు. ‘‘నీ కష్టం ఊహించని విధంగా ఫలితాన్నిస్తుంది సందీప్. తల ఎత్తుకోని, చిరునవ్వుతో ఉండు. కళ దాని దారిన అది వెళ్లనివ్వు. చివరికి సినిమానే గెలుస్తుంది’’ అని సాయి దుర్గ తేజ్ ట్వీట్ చేశారు. నిరాశకు లోనైన ఒక ప్రతిభావంతుడైన దర్శకుడికి సాయి దుర్గ తేజ్ రూపంలో అండ దొరకడం, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని ఆయనకు ధైర్యం చెప్పడం సినీ పరిశ్రమలోని సానుకూల వాతావరణాన్ని తెలియజేస్తుంది. తాత్కాలిక అడ్డంకులు ఎదురైనా, సందీప్ రాజ్ తన అభిరుచిని, ప్రతిభను కొనసాగించి గొప్ప విజయాలు సాధిస్తారని సినీ ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Your hardwork will pay off in the most unexpected ways Sandeep, keep your head held high and smile. Let the art form take its own course, At the end “cinema is winning” https://t.co/5Wc2FwrbSk
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 9, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

