Director Maruthi: టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభాస్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా గురించే చర్చ జరుగుతోంది. మారుతి (Director Maruthi) దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు మారుతి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మారుతి కాన్ఫిడెన్స్ చూసి కొందరు మురిసిపోతుంటే, మరికొందరు మాత్రం ‘అప్పుడు అలా చెప్పి.. ఇప్పుడు ఇలా చేస్తావేంటి మారుతి?’ అని ప్రశ్నిస్తున్నారు. వేదికపై మారుతి మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా వచ్చింది. ఒక్క నిమిషం కూడా ఎక్కడా బోర్ కొట్టదు. అలా ఎక్కడైనా బోర్ కొడితే నా ఇంటి అడ్రస్ ఇస్తాను.. వచ్చి అడగండి అంటూ సవాల్ విసిరారు. ఒక స్టార్ హీరో సినిమా విషయంలో దర్శకుడికి అంత నమ్మకం ఉండటం మంచిదే కానీ, విమర్శలను ఆహ్వానించే పద్ధతి ఇదేనా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. సినిమా నచ్చకపోతే ఇంటికి వచ్చి అడగమనడం ఒక రకమైన ‘అతి’ విశ్వాసం కిందకే వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read- Aadi Saikumar: ‘శంబాల’ సక్సెస్ జోష్.. హిట్ బ్యానర్‌లో ఆదికి బంపరాఫర్!
అవి మరిచిపోయావా..
గతంలో ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీ సమయంలో దర్శకుడు మోహన్ శ్రీవత్స తన సినిమా హిట్ కాకపోతే చెప్పుతో కొట్టుకుంటానంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే ఆయన చెప్పుతో కొట్టుకున్నారు. అప్పట్లో మారుతి ఈ విషయంపై స్పందిస్తూ చాలా పెద్ద క్లాస్ ఇచ్చారు. ‘సినిమా అనేది ఒక కళ, దానిని గౌరవించాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పరిశ్రమపై తప్పుడు సంకేతాలు వెళ్తాయి’ అన్నట్టుగా నీతులు చెప్పారు. మరి అప్పుడు అంతలా హితబోధ చేసిన మారుతి, ఇప్పుడు తన సినిమా విషయంలో ఇంటి అడ్రస్ ఇస్తా అని చెప్పడం ఏ రకమైన సంకేతం ఇస్తోంది? కేవలం మోహన్ శ్రీవత్స మాత్రమే కాదు, ‘మోగ్లీ 2025’ చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ తన సినిమా విడుదల విషయంలో ఆవేదన చెందుతూ ‘నేను దురదృష్టవంతుడిని’ అన్నప్పుడు కూడా మారుతి రంగంలోకి దిగారు. సానుకూల దృక్పథంతో ఉండాలని, ఓపిక పట్టాలని ఆయనకు నీతులు చెప్పారు. మరి ఇతరులు భావోద్వేగానికి లోనైనప్పుడు పద్ధతులు నేర్పిన మారుతి, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద తన సినిమా విడుదలవుతున్న వేళ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం డబుల్ స్టాండర్డ్స్ కాదా అని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
Also Read- Thalapathy Vijay: సినిమాలకు గుడ్‌బై.. అధికారికంగా ప్రకటించిన దళపతి విజయ్
విమర్శలకు చోటివ్వకూడదు
సినిమా బాగుంటే ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారు, బాలేకపోతే సున్నితంగా తిరస్కరిస్తారు. అంతే తప్ప, ఎవరూ డైరెక్టర్ ఇంటికి వెళ్లి నిలదీయరు. మారుతి లాంటి సీనియర్ దర్శకుడు ఈ విషయాన్ని గుర్తించాలి. ఇతరులకు ఒక నీతి, తనకు మరొక నీతి అన్నట్టుగా వ్యవహరించడం వల్ల ఆయన క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంది. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్‌తో సినిమా చేస్తున్నప్పుడు మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సింది పోయి, ఇలాంటి ఛాలెంజ్‌లు చేయడం అవసరమా? మారుతి గారూ.. మీరు చెప్పినట్టుగానే ‘రాజా సాబ్’ బోర్ కొట్టకుండా ఉంటే అందరం సంతోషిస్తాం. కానీ, మీరు గతంలో చెప్పిన నీతులను మీరే తుంగలో తొక్కడం మాత్రం ఎవరికీ మింగుడు పడటం లేదు. మాటల్లో కాకుండా, రేపు థియేటర్లో మీ సినిమాతో సమాధానం చెబితేనే మీ హుందాతనం నిలబడుతుంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

