Bhanu Bhogavarapu: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటించిన 75వ చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రం కోసం మాస్ మహారాజా అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొంది, సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌ని యమా జోరుగా మేకర్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్ర దర్శకుడు భాను భోగవరపు (Bhanu Bhogavarapu), మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
టైటిల్ రవితేజానే సూచించారు
‘‘మాస్ జాతర సినిమాలో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో ఒక కొత్త పాయింట్ కూడా ఇందులో ఉంది. రైల్వే పోలీస్ నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. ఆ నేపథ్యంలో జరిగే క్రైమ్ కొత్తగా ఉంటుంది. సన్నివేశాలు కూడా చాలా కొత్తగా ఉంటాయి. ‘మాస్ జాతర’ టైటిల్‌ను రవితేజానే సూచించారు. ఈ టైటిల్ తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. మాస్ అంశాలు మరిన్ని జోడించాను. థియేటర్‌లో ప్రేక్షకులు కొన్ని సర్ ప్రైజ్‌లు చూడబోతున్నారు. ఇది కల్పిత కథే. కాకపోతే ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాల గురించి, వారు ఎదుర్కొన్న సంఘటల గురించి అడిగి తెలుసుకున్నాను. వాటి స్ఫూర్తితో ఈ కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం జరిగింది.
Also Read- Malavika Mohanan: చిరు-బాబీ సినిమాలో.. క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ హీరోయిన్!
మంచి మాస్ కథ ఉంటే చెప్పు అనేవారు
నిజంగా ఇది రవితేజ 75వ చిత్రమని మాకు ముందు తెలియదు. ఆయనకు కథ నచ్చి, సినిమా ఓకే అయిన తర్వాత.. అప్పుడు లెక్కేస్తే 75వ సినిమా అని తెలిసింది. కథ బాగుంది, ఈ నెంబర్ల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా సినిమా చేయమని ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఇందులో వినోదానికి పెద్ద పీట వేశాము. మాస్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వాస్తవానికి నేను ‘సామజవరగమన’ వంటి రొమాంటిక్ కామెడీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వాలనుకున్నాను. కానీ, ఎక్కువమంది మంచి మాస్ కథ ఉంటే చెప్పు అనేవారు. అలా ‘మాస్ జాతర’ కథ రాయడం జరిగింది. మాస్ కథ అంటే మొదట గుర్తుకొచ్చే పేరు రవితేజ. ఆయనను దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాశాను. ఆయన ఇప్పటి వరకు కొన్ని పోలీస్ సినిమాలు చేశారు. అందుకే కొత్తగా ఉండేలా ఈ రైల్వే పోలీస్ కథని రాసుకున్నాను. నేను రవితేజకు అభిమానిని. ఆయన ఖాకీ డ్రెస్ వేసిన సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలుసు. అవన్నీ దృష్టిలో పెట్టుకొనే స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. రవితేజ ఐకానిక్ మూమెంట్స్‌ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ‘వెంకీ, ఇడియట్’ సినిమాల రిఫరెన్స్ పెట్టడం జరిగింది. అలా అని అవి కథకి అడ్డుగా ఉండవు. అభిమానులు సెలబ్రేట్ చేసుకునేలా ఉంటాయి. రవితేజ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఉంటూనే ‘మాస్ జాతర’ చిత్రం కొత్తగా ఉంటుంది. హాస్య సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలను కొత్తగా రూపొందించాము’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
