Nadeem Khan: సినిమా ఇండస్ట్రీలో వెలుగుల వెనుక ఎన్ని చీకటి కోణాలు ఉంటాయో చెప్పడానికి మరో ఉదాహరణ తాజాగా వెలుగులోకి వచ్చింది. రణవీర్ సింగ్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ధురంధర్’ (Dhurandhar)లో తన నటనతో మెప్పించిన నటుడు నదీమ్ ఖాన్ (Nadeem Khan), ఇప్పుడు జైలు పాలయ్యాడు. తన ఇంట్లో పనిచేసే మహిళపై పదేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడనే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ముంబై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అసలు విషయంలోకి వస్తే.. ఈ వ్యవహారం 2015లో మొదలైంది. బాధితురాలైన 41 ఏళ్ల మహిళ, పలువురు సినీ తారల ఇళ్లలో పనిమనిషిగా పనిచేసేది. ఆ క్రమంలోనే నదీమ్ ఖాన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. నదీమ్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ‘పెళ్లి చేసుకుంటాను’ అన్న భరోసాతో ఆమెను పదేళ్లపాటు శారీరకంగా లొంగదీసుకున్నాడని బాధితురాలు కూడా తన ఫిర్యాదులో పేర్కొంది. వెర్సోవా, మాల్వాని వంటి ప్రాంతాల్లోని వివిధ నివాసాల్లో ఈ లైంగిక దాడి కొనసాగినట్లు సమాచారం. దశాబ్ద కాలం పాటు ఆమెను నమ్మించి, తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి నదీమ్ ఖాన్ ముఖం చాటేయడంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది.
Also Read- Rajendra Prasad: ‘పద్మశ్రీ’.. నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా!
జీరో ఎఫ్ఐఆర్ నుండి అరెస్ట్ వరకు..
మొదట బాధితురాలు వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రాథమిక దర్యాప్తు మాల్వాని పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో కేసును జీరో ఎఫ్ఐఆర్ కింద మాల్వానికి బదిలీ చేశారు. జనవరి 22న మాల్వాని పోలీసులు నదీమ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి, సామాన్య మహిళను ఇంత కాలం మోసం చేయడం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. నదీమ్ ఖాన్ కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘ధురంధర్ పార్ట్ 1’ సినిమాలో అక్షయ్ ఖన్నా దగ్గర వంటవాడు అఖ్లాక్ పాత్రలో నదీమ్ నటించాడు. ఇంతకు ముందు అమితాబ్ బచ్చన్, సంజయ్ మిశ్రా, ఆదిల్ హుస్సేన్ వంటి దిగ్గజ నటులతో కలిసి పని చేసిన అనుభవం నదీమ్‌కు ఉంది. నదీమ్ ఖాన్ అరెస్ట్ వార్త బయటకు రాగానే, ఇండస్ట్రీలోని స్టార్లతో ఆయన దిగిన పాత ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read- Murali Mohan: లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది.. పద్మశ్రీపై మురళీ మోహన్ స్పందనిదే!
ఆ సినిమాపై ప్రభావం
నదీమ్ అరెస్ట్ ఇప్పుడాయన నటించిన సినిమాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఫిబ్రవరి 6న నదీమ్ నటించిన ‘వధ్ 2’ విడుదల కావాల్సి ఉంది. సంజయ్ మిశ్రా, నీనా గుప్తా వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సరిగ్గా సినిమా రిలీజ్‌కు రెండు వారాల ముందు నటుడు ఇలాంటి కేసులో ఇరుక్కోవడం చిత్ర యూనిట్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఒక నటుడిగా సమాజంలో గౌరవం పొందాల్సిన వ్యక్తి, పదేళ్లపాటు ఒక మహిళా నమ్మకాన్ని వమ్ము చేస్తూ క్రూరంగా ప్రవర్తించడం సభ్యసమాజాన్ని విస్మయానికి గురి చేస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, బాధితురాలికి న్యాయం జరుగుతుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వెండితెరపై కనిపించే మెరుపులు నిజ జీవితంలో ఉండవని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

