Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో సక్సెస్, జానర్ పరంగా చూస్తే ‘కొదమసింహం’ (Kodamasimham) చిత్రం చాలా ప్రత్యేకమైనదనే విషయం తెలియంది కాదు. చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమాను, నవంబర్ 21వ తేదీన 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్‌తో సరికొత్తగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ రిలీజ్ (Kodamasimham Re Release) చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం ప్రెస్ ప్రీమయర్ షో అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, సినిమాతో తమకున్న అనుభవాలను నిర్మాత కైకాల నాగేశ్వరరావు, డైరెక్టర్ మురళీ మోహన్ రావు, రైటర్ సత్యానంద్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, రైటర్ పరుచూరి గోపాలకృష్ణ షేర్ చేసుకున్నారు. ఈ సమావేశంలో స్పెషల్ వీడియో ద్వారా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ..
కౌబాయ్ మూవీ చేస్తానని ఊహించలేదు
తన వెనుక గోడపై ఉన్న సినిమా స్టిల్ చూపిస్తూ.. ‘‘ఈ స్టిల్ ‘కొదమసింహం’ సినిమాలో చాలా పాపులర్. నా ఫేవరేట్ ఫొటో అది. నాకు నచ్చిందని నిర్మాతలు ఆ స్టిల్‌ను ఫ్రేమ్ చేసి గిఫ్ట్‌గా ఇచ్చారు. మా ఇంట్లో ఇప్పటికీ ఈ ఫొటో అలానే ఉంది. నాకు మొదటి నుంచి కౌబాయ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. క్లింట్ ఈస్ట్ వుడ్, గ్రెగరీ పెక్, ఒమర్ షరీఫ్ వంటి స్టార్స్ చేసిన సినిమాలను ఇష్టంగా చూస్తుండేవాడిని. నేను నటుడిని అయ్యాక అలాంటి కౌబాయ్ మూవీ వస్తుందని, నేను చేస్తానని అసలెప్పుడూ ఊహించలేదు. అప్పటికి సూపర్ స్టార్ కృష్ణ చేసిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా పెద్ద హిట్టై అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది. అలాంటి సినిమా మళ్లీ చేయడం నిజంగా సాహసమే అవుతుంది. రమా ఫిలింస్ నిర్మాత నాగేశ్వరరావు కౌబాయ్ కథతో మీతో ఒక కొత్త తరహా మూవీ చేయాలని ఉందని డైరెక్టర్ మురళీ మోహన్ రావుతో కలిసి వచ్చి కథ చెప్పారు. కథ బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పాను. అలా ‘కొదమసింహం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read- Balakrishna: మన దెబ్బేంటో హిందీవాళ్లకు చూపించాం.. బాలయ్య బాలీవుడ్‌ని తక్కువ అంచనా వేస్తున్నాడా?
సుడిగాలి పాత్రంటే చాలా ఇష్టం
అప్పుడు హీరోకి క్లీన్ షేవ్ ఉండాలనే దానిపై చర్చలు నడిచాయి. కానీ మొదటిసారి నేను గడ్డం పెంచి నటించిన సినిమా ఇది. ఈ సినిమాలో నాకు బాగా ఇష్టమైన పాత్ర మోహన్ బాబు (Mohan Babu) చేసిన సుడిగాలి పాత్ర. ఈ పాత్రలో ఫన్, జుగుప్స, విలనిజం అన్నీ కలిపి ఉంటాయి. మోహన్ బాబు కాకుండా మరో నటుడైతే నిజంగా ఈ పాత్రను ఇంత బాగా ఒప్పించి మెప్పించి ఉండేవారు కారు. అది కేవలం మోహన్ బాబు వల్లే సాధ్యమైంది. విలన్‌గా బాలీవుడ్ లెజెండరీ నటుడు ప్రాణ్ నటించారు. ఆయనతో కలిసి నటించే అదృష్టం నాకు ఈ సినిమాతో దక్కింది. కైకాల సత్యనారాయణ, మారుతీరావు, అన్నపూర్ణ, సోనం, రాధ వీళ్లతో కలిసి ఈ సినిమాలో నటించాను. వీళ్లతో ప్రతి సీన్, ప్రతి సాంగ్, ప్రతి యాక్షన్, హార్స్ రైడింగ్, ఇవన్నీ హైలైట్స్. ఈ సినిమాలోని సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రాజ్ కోటి అంత మంచి సాంగ్స్ ఇచ్చారు. ఇందులో ‘జపం జపం జపం కొంగ జపం’ పాట నా ఫేవరేట్ సాంగ్. ఆ పాటకు ప్రభుదేవా చక్కటి కొరియోగ్రఫీ చేశాడు. తన స్టైల్‌ను నేను ఫాలో అయ్యాను. ఈ పాటలో ఫ్లోర్ నుంచి గోడపైకి స్టెప్స్ వేస్తూ మళ్లీ ఫ్లోర్ మీదకు రౌండ్‌గా వచ్చే డ్యాన్స్ మూవ్ మెంట్ ఉంటుంది. ఒకే షాట్‌లో ఆ స్టెప్ పూర్తి చేశాం. దీన్ని ఎలా చేశారని అందరూ సర్‌ప్రైజై అడిగేవారు. అది మెట్లున్న ఒక వీల్‌కు కెమెరా పెట్టి చేశాం. ఇటీవల వచ్చిన ‘ఇన్సెప్షన్’ అనే హాలీవుడ్ మూవీలో అలాంటి షాట్ చూశాను. మేము ఆ టైమ్‌లోనే ఇలాంటి టెక్నాలజీ వాడి ఆ షాట్ చేయగలిగాం.
Also Read- Manchu Lakshmi: ఆ పని చేయకపోతే మహేష్, నమ్రతలను కొడతా.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
ఈ సినిమా రామ్ చరణ్‌కు బాగా ఇష్టం
నాకు ఈ సినిమా ఫేవరేట్ మూవీ, నాకంటే కూడా రామ్ చరణ్ (Ram Charan)కు ఈ సినిమా చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు వాళ్ల అమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితే గానీ చరణ్ భోజనం చేసేవాడు కాదు. అంతగా చరణ్‌కు ఇష్టమైన సినిమా ఇది. ప్రస్తుతం రీ రిలీజ్‌ల టైమ్ నడుస్తుంది. ఈ జెనరేషన్ ప్రేక్షకులకు కూడా మనం చేసిన కౌబాయ్ సినిమా ఎలా ఉంది, మన డ్యాన్సెస్, మన ఫైట్స్, మన యాక్షన్ సీక్వెన్సులు ఎలా ఉన్నాయి? మన క్యారెక్టరైజేషన్స్‌ని అప్పట్లో ఎలా తీశారు? అని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నందుకు రమా ఫిలింస్ అధినేత నాగేశ్వరరావుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారి ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సరికొత్తగా నవంబర్ 21న వస్తున్న ఈ సినిమాతో ప్రేక్షకులు చక్కగా ఎంజాయ్ చేస్తారు’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
