Chhaava: జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి దర్శకుడిగా మారి రూపొందించిన ‘బలగం’ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో, ఎన్ని అవార్డులను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విడుదలకు ముందు అసలు ఎటువంటి అంచనాలు లేవు. ఈ కమెడియన్ సినిమా తీయడమేంటి? అని హేళన చేసినవారూ ఉన్నారు. కానీ విడుదల తర్వాత ఒక్కసారిగా వేణుపై ఒక్కొక్కరికి గౌరవం ఏర్పడింది. కారణం ఆ సినిమాలో వేణు తీసుకున్న కంటెంట్.
Also Read- Nandamuri Kalyan Ram: ప్రాణం పోయడం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే స్త్రీమూర్తుల కోసమే ఈ సినిమా..
రియల్ లొకేషన్స్‌లో వేణు ‘బలగం’ సినిమాను తెరకెక్కించిన తీరు, ఆ సినిమా కోసం ఆయన ఎంచుకున్న పాత్రలు అన్నీ కూడా, రియాలిటీని తలపించాయి. నిజంగా ఇది కదా మన సినిమా, ఇది కదా మన సంస్కృతి అంటూ తెలంగాణ వాళ్లంతా ఆ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే.. చాలా కాలం తర్వాత ‘బలగం’ సినిమాకు బహిరంగ ప్రదర్శనలు పడ్డాయి. అవును పల్లెటూర్లలో తెరలు ఏర్పాటు చేసి మరీ ఈ సినిమాను ప్రదర్శించారు. ఇది కదా సినిమా సక్సెస్‌కు కొలమానం అనిపించేలా ‘బలగం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మాయ చేసింది.
సేమ్ టు సేమ్ మళ్లీ అలాంటి సక్సెస్‌ని అందుకున్న చిత్రంగా బాలీవుడ్ చిత్రం ‘ఛావా’ రికార్డును క్రియేట్ చేసింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాధని వివరించే చారిత్రక ఇతిహాసంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ స్పందనను రాబట్టుకుని, బాలీవుడ్‌లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా రికార్డును సృష్టించింది. దినేష్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించగా.. రష్మికా మందన్నా యేసుబాయి భోంస్లేగా, అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా, డయానా పెంటీ జినత్-ఉన్-నిస్సా బేగంగా, అశుతోష్ రాణా హంబిర్రావ్ మోహితేగా, దివ్య దత్తా సోయారాబాయిగా కనిపించారు.
(Video Credit: SSCBPL Insta Account)
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఛావా’.. ఇటీవల తెలుగు భాషలో సైతం విడుదలైన విషయం తెలిసిందే. ఇక ‘బలగం’ సినిమాతో పోల్చడానికి కారణం.. ఈ సినిమాను మహారాష్ట్రలోని ప్రతి ఒక్కరూ చూసేలా బహిరంగ ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నారు. ఊళ్లలో తెరలు కట్టి మరి ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అలా ఒక ప్రాంతంలోని గ్రౌండ్‌లో ‘ఛావా’ సినిమాను ప్రదర్శించగా.. జనాలు భారీగా తరలివచ్చారు. ఫ్లై ఓవర్‌పై ఆగి మరీ వీక్షిస్తున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
Also Read- Sapthagiri: నిజం.. సినిమా వాళ్లకు పిల్లని ఇవ్వరు.. ఇదేంటో నాకర్థం కావడం లేదు!
ఈ వీడియోను చూసిన వారంతా.. ‘బలగం’ తర్వాత మళ్లీ ‘ఛావా’కే ఇలా జరిగిందని, ఇది కదా సక్సెస్ అంటే, సక్సెస్‌కు కొలమానం ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఛావా’ టీమ్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. కొన్ని సినిమాలకు మాత్రం ఇలాంటి అవకాశం వరిస్తుందని, కొన్ని సినిమాలు మాత్రమే ప్రజల మనసులు గెలుచుకుంటాయనేలా నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు