Bro Code Movie: జయం రవి.. ఈ పేరు అందరికీ పరిచయమే. కాకపోతే ఈ మధ్య ఆయన పేరు వినకూడని విధంగా వినిపిస్తూ ఉంది. భార్య ఆర్తితో గొడవలు, విడాకులు, కెనిషాతో ప్రేమాయణం అంటూ రకరకాలుగా వార్తలు వినిపించాయి.. వినిపిస్తూనే ఉన్నాయి. ఓ పెళ్లి వేడుకలో, అలాగే తాజాగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న సమయంలో జయం రవి (Jayam Ravi)తో పాటు కెనిషా కూడా పక్కనే ఉండటంతో.. వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలకు బలం చేకూర్చినట్లయింది. ఆయన భార్య కూడా భారీగా భరణం ఇవ్వాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. వీటన్నింటి నడుమ.. జయం రవి ఇప్పుడో సంచలన స్టెప్ వేశారు. తన పేరును జయం రవి అని కాకుండా.. రవి మోహన్ (Ravi Mohan) అని మార్చుకన్న ఆయన, అదే పేరుతో స్టూడియోని స్థాపించి, నిర్మాతగా మారారు.
రవి మోహన్ స్టూడియోస్ గ్రాండ్‌గా ప్రారంభం
వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న రవి మోహన్ ఇప్పుడు నిర్మాతగా మారి, రవి మోహన్ స్టూడియోస్ (Ravi Mohan Studios) పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శివ కార్తికేయన్, కార్తీ, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రవి మోహన్ తన ‘రవి మోహన్ స్టూడియోస్’ను అందరికీ పరిచయం చేశారు. అలాగే తన ప్రొడక్షన్‌లో రాబోతోన్న రెండు సినిమాల వివరాలను తెలిపారు. ఈ రెండింటిలో ఓ సినిమాను రవి మోహన్ డైరెక్ట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.
Also Read- Thammudu Movie re release: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్‌గా ‘తమ్ముడు’ రీ రిలీజ్.. హంగామా మొదలైంది
తొలి సినిమా ఇదే..
రవి మోహన్ స్టూడియోస్‌పై రూపుదిద్దుకోనున్న రెండు సినిమాలలో మొదటిది ‘బ్రో కోడ్’. కార్తీక్ యోగి దర్శకత్వంలో రవి మోహన్, ఎస్.జె.సూర్య, అర్జున్ అశోకన్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. గౌరీ ప్రియ, శ్రద్ధా శ్రీనాథ్, మాళవిక మనోజ్ వంటి వారు కూడా ఈ సినిమాలో భాగం కానున్నారని రవి మోహన్ తెలిపారు. మరో సినిమా రవి మోహన్ స్వీయ దర్శకత్వంలో యోగి బాబు హీరోగా తెరకెక్కనుందని ప్రకటించారు.
అస్సలు ఊహించలేదు
ఈ సంస్థ లాంచింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కార్తీ (Karthi) మాట్లాడుతూ.. నేను రవిని స్టంట్ క్లాస్‌లో కలిశాను. అప్పుడు నేను ఇండస్ట్రీకి కొత్త. తను ఆ సమయంలో చాలా ఉత్సాహంగా ఉండేవారు. రవి ఇలా ఇంత గ్రాండ్‌గా నిర్మాణ సంస్థను ప్రారంభిస్తాడని నేను అస్సలు ఊహించలేదు. తను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. తన ప్రొడక్షన్ కంపెనీలో రాబోతోన్న ‘బ్రో కోడ్’, యోగిబాబు ప్రాజెక్టులు విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. మరో హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan) మాట్లాడుతూ.. రవి, నేను.. ఇలా అందరు నటులు నిర్మాణ సంస్థలను ప్రారంభిస్తే, పరిశ్రమకు చాలా మంచి కథలు వస్తాయని ఆశిస్తున్నాను. ఇది చాలా మంచి పరిణామం అని తెలిపారు. నటుడు యోగిబాబు మాట్లాడుతూ.. ఆరేళ్ల క్రితం ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న రవి మోహన్‌కు థాంక్స్. ఆ మాట ఏమిటంటే.. దర్శకత్వం చేస్తే.. మొదటి చిత్రంలో హీరోగా అవకాశం ఇస్తానని, ఇచ్చిన మాట ప్రకారం నాతో సినిమాను చేస్తున్నారని పేర్కొన్నారు.
Also Read- Shilpa Shirodkar: సుధీర్ బాబు ‘జటాధర’లో నమ్రత శిరోద్కర్ సోదరి.. ఫస్ట్ లుక్‌తోనే వణికిస్తుందిగా!
అండగా నిలిచింది వారే..
హీరో, నిర్మాత, దర్శకుడు రవి మోహన్ మాట్లాడుతూ.. ఈ సమయంలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో నాకు మాత్రమే తెలుసు. నేను, కార్తీ ఇద్దరం కూడా విలాసాలను కోరుకోము. చాలా సింపుల్‌గా ఉండాలని అనుకుంటాం. ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ సమయంలో మేం ఒకరినొకరం ఎంతగానో తెలుసుకున్నాం. సినిమా అనేది లక్షలాది మందికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే సాధనం మాత్రమే కాదు, ఒక ఎమోషన్. నాకు నా అభిమానులే ఈ జర్నీలో అండగా నిలిచారు. వారి వల్లే ఈ స్థాయికి వచ్చాను. నేను సాధించాల్సిన కలలు చాలా ఉన్నాయి. నేను ప్రారంభించిన ఈ కంపెనీ కేవలం నా సొంత సినిమాల కోసమే కాదు. యువ, కొత్త దర్శకులకు అవకాశాలను ఇవ్వడం, ఎంతో మంది కలలను సాకారం చేయడం, సినిమాలు, OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం ప్రాజెక్టులు చేయడం నా ఉద్దేశం. కొత్త వారికే నేను ప్రాధాన్యం ఇస్తానని చెప్పుకొచ్చారు.
రవి మోహన్‌ను ఉద్దేశించి కెనిషా మాట్లాడుతూ.. నాకు ఓ మంచి కుటుంబాన్ని ఇచ్చావు. నా ఈ జర్నీ ఎంతో కష్టంగా సాగింది. కానీ నా కంటే ఎక్కువ కష్టాల్ని నువ్వు ఎదుర్కొన్నావు. ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. నువ్వెప్పుడూ ఇతర జీవితాల్లో వెలుగులు నింపాలనే ప్రయత్నిస్తుంటావు. ఈ ప్రొడక్షన్ కంపెనీ పెట్టేందుకు ఎంతో కష్టపడ్డావో.. దానికి తగిన విధంగా విజయాలు దక్కాలని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు