Boyapati Sreenu: నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ2: తాండవం’ (Akhanda 2: Thaandavam) చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ ‘అఖండ భారత్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’ పేరుతో ఘనంగా విజయోత్సవాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Sreenu) చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమా విజయం, దైవ సంకల్పం, తెలుగు పరిశ్రమ ఐక్యత వంటి విషయాలపై ఈ కార్యక్రమంలో బోయపాటి మాట్లాడారు. ఆయన స్పీచ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
విజయం మాది కాదు… ధర్మానిది
ఆయన మాట్లాడుతూ.. సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమా విజయానికి సంబంధించిన కలెక్షన్‌లు, రికార్డుల గురించి మాట్లాడడం కంటే, సినిమా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ‘‘మాకు డబ్బు ముఖ్యం కాదు. డబ్బు గురించి తాపత్రయపడలేదు. మా ఉద్దేశం ఒక్కటే, ఈ తరానికి దేశం గురించి, ధర్మం గురించి, దైవం గురించి ఇంత గొప్పగా ఒక కమర్షియల్ ప్లాట్‌ఫామ్‌పై చెప్పినప్పుడు… ఇది జనంలోకి వెళ్లాలి. వాళ్లు ఆదరిస్తే చాలు. భారతదేశం ధర్మ గ్రంథాలయం. ధర్మానికి భారతదేశం తల్లి వేరు లాంటిది. దాన్ని నమ్మిన దేశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. నమ్మని దేశాలు ఇంకోలా ఉన్నాయి. మనిషి అనుకుంటే గెలవచ్చు ఓడిపోవచ్చు. కానీ దేవుడు అనుకుంటే గెలుపు మాత్రమే ఉంటుంది. అలా దేవుడు గెలిపించిన సినిమానే ఇది’’ బోయపాటి తెలిపారు.
Also Read- Jinn Trailer: భూతనాల చెరువు కాలేజ్‌లో దాగి వున్న మిస్టరీ ఏంటి? ఇది ‘జిన్’ ఆడే ఆట!
శివుడి సంకల్పమే ఈ విజయం
సినిమా విజయం వెనుక ఉన్న అసలు శక్తిని ప్రస్తావిస్తూ.. ‘‘శివుడు శాశ్వతం, భగవంతుడు శాశ్వతం. ఒక మనిషి అనుకుంటే గెలవొచ్చు, ఓడొచ్చు. కానీ దేవుడు అనుకుంటే మాత్రం గెలిపే ఉంటది’ అని బోయపాటి చెప్పుకొచ్చారు. ఈ సినిమాను దేవుడి సంకల్పమే ముందుకు తీసుకొచ్చిందని, ఎవరు అడ్డం వచ్చినా దేవుడే చూసుకుంటాడని ఆయన దృఢంగా నమ్మారు. ఈ సందర్భంగా చిత్ర బృందం పడ్డ కష్టం గురించి వివరించారు. ముఖ్యంగా యాక్షన్ మాస్టర్స్ అయిన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్‌తో పాటు సాంకేతిక నిపుణులందరూ మైనస్ 12 డిగ్రీల నుండి ప్లస్ 48 డిగ్రీల వంటి విపరీత వాతావరణంలో కేవలం రెండు రోజుల గ్యాప్‌లోనే పని చేశారని గుర్తు చేశారు. తమ సినిమాను గెలిపించుకోవాలనే లక్ష్యంతో అహర్నిశలు శ్రమించిన ప్రతి టెక్నీషియన్‌కు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
Also Read- Bigg Boss Telugu 9: ఐదుగురు హౌస్‌మేట్స్‌తో ఎమోషనల్ డ్రామా మొదలైంది.. సంజన, తనూజ ఔట్!
తెలుగు పరిశ్రమ ఐక్యతకు పిలుపు
సంగీత దర్శకుడు థమన్ మాటలను ప్రస్తావిస్తూ, తెలుగు సినీ పరిశ్రమంతా కుటుంబంలా కలిసి ఉండాల్సిన అవసరం గురించి బోయపాటి బలంగా పిలుపునిచ్చారు. ‘‘మనం గెలవడం కాదు, మన సినిమా గెలవాలి. మన తర్వాత రిలీజ్ అయ్యే సినిమా గెలవాలి. ప్రతి ఒక్కరూ బాగుండాలి’’ అనే సదుద్దేశంతోనే తాము ముందుకెళ్తున్నామన్నారు. నలుగురు కలిసి ఉంటేనే ఈ దేశంలో నిలబడగలం అని, తెలుగు పరిశ్రమ ఈరోజు దేశంలోనే పెద్ద పరిశ్రమగా ఎదిగిందని, ఆ స్థాయిని నిలబెట్టుకోవాలని పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ విన్నవించుకున్నారు. చివరిగా, ‘అఖండ 2: తాండవం’ 3డి వెర్షన్ అద్భుతంగా ఉందని, అభిమానులందరూ దాన్ని 3డిలో చూసి కొత్త లోకాన్ని అనుభవించాలని ఆయన కోరారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

