Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కాంబోలో వచ్చిన లేటెస్ట్ సంచలనం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2 Thaandavam). ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించిన ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. మిశ్రమ టాక్‌తో థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మనిషి పుట్టుకకు ఏదో కారణం ఉంది
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ‘‘అఖండ 2: తాండవం విజయోత్సవ పండుగకు వచ్చిన అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. ఒక పని కోసం కొందరిని ఆ పరమశివుడే ఎంచుకుంటాడు. ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సినిమా విడుదలై ఇంత విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమాను ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు, యావత్ భారత దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో.. ఆ ఉద్దేశాన్ని ప్రేక్షకులు పాటించాలి. మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం తప్పకుండా ఉంటుంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు సనాతన హైందవ ధర్మం మీసం మేలేసిందని చెప్తుంటే చాలా గర్వంగా ఉంది. మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలగలిపిన ఈ సినిమా అందరినీ అలరించిందని యావత్ ప్రపంచం చెబుతోంది. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
Also Read- Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..
నాకు పదునైన పొగరు
ఈ సినిమాలో ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఆణిముత్యం. ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగ ప్రకంపనం. ఈ రోజుల్లో ప్రజలు సినిమాని కూడా ఒక నిత్యవసర వస్తువుగా చూస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎటువంటి సినిమాలు తీయాలనిది కూడా అందరూ ఆలోచించుకోవాలి. వరుసగా ఐదు సినిమాలు విజయం సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది. నా నుంచి రాబోయే సినిమా కూడా అద్భుతమైన చరిత్ర సృష్టించబోతుంది. చరిత్రలో చాలా మంది ఉంటారు. సృష్టించిన చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాసి తిరిగి చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే. అది ఒక తెలియని శక్తి. ‘ఎవరిని చూసుకుని రా బాలకృష్ణకు అంత పొగరు’ అని చాలా మంది అంటారు. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు.. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం. నన్ను నేను తెలుసుకోవడమే.. నా వృత్తి నా దైవం. ఆ వృత్తే ఈ సినిమాలోని అఖండ పాత్ర.
Also Read- Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది
మనిషే దేవుడైతే ఏమవుతుంది?
ఈ సినిమా కేవలం భారతం, భాగవతానికి సంబంధించిన సినిమానే కాదు.. ఒక బైబిలు, ఒక ఖురాన్‌కి కూడా సంబంధించిన సినిమా. మన వేదం నుంచే విజ్ఞానం పుట్టింది. మన దేశం యొక్క గొప్పతనం మనం చెప్పుకోవాలి. అప్పుడే యువతరానికి అర్థమవుతుంది. మేము చేసిన ‘అఖండ’ సినిమా కూడా ఒక పరీక్ష లాంటిదే. సరిగ్గా కోవిడ్ సమయంలో రిలీజైంది. థియేటర్స్‌కి ఆడియన్స్ వస్తారా లేదా? అనే ఒక మీమాంస ఉండేది. అలాంటి సమయంలో భగవంతుడి మీద భారం వేసి మా సినిమా రిలీజ్ చేశాం. ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మిగతా నిర్మాతలు అందరికీ ధైర్యం వచ్చి సినిమాలను రిలీజ్ చేయడం చేశారు. ‘అఖండ’లో దేవుడు మనిషిలో పూనాడు. ‘అఖండ 2’లో మనిషే దేవుడైతే ఏమవుతుంది.. సంభవామి యుగే యుగే అన్నదే చూపించాం. సకుటుంబం సపరివార సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూస్తున్నారు. పిల్లలకు కూడా ఈ సినిమాని చూపించి, మన మూలాల గురించి తెలియజేయాలని కోరుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

