AR Rahman: ఏఆర్ రెహమాన్.. ఈ పేరు తెలియని ఇండియన్ ఉండరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఆస్కార్ సాధించి దేశపు గర్వకారణంగా నిలిచిన ఏఆర్ రెహమాన్‌ను మతాలతో సంబంధంలో లేకుండా అందరూ ఎంతగానో అభిమానిస్తారు. అలాంటి రెహమాన్ ఇప్పుడు నితేశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రాబోతున్న విజువల్ వండర్ ‘రామాయణ’ (Ramayana) సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే, రాముడికి గుడి కట్టడంలో కబీర్ దాస్ పాత్ర ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కబీర్ దాస్ దృష్టిలో ‘రాముడు’ అంటే కేవలం ఒక వ్యక్తి లేదా ఒక రాజు మాత్రమే కాదు. ఆయన నమ్మే రాముడు ‘నిర్గుణ రాముడు’.. అంటే అంతటా నిండి ఉండే పరమాత్మ. ‘రాముడు అందరివాడు’ అని కబీర్ చాటి చెప్పడమే కాకుండా.. హిందూ-ముస్లింల మధ్య వారధిగా నిలిచారు. అలాంటిది ఇప్పుడు ‘రామాయణ’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడంపై ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ‘రామాయణ’ ప్రాజెక్టులో ఒక ముస్లిం అయి ఉండి ఎలా భాగస్వామి అయ్యారు? అనే ప్రశ్నకు రెహమాన్ తనదైన తరహాలో సమాధానమిచ్చారు.
Also Read- MSG Collections: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 5 డేస్ కలెక్షన్స్.. మైండ్ బ్లోయింగ్!
మతాలకు అతీతంగా జ్ఞానం, కళ
దీనిపై రెహమాన్ (AR Rahman) స్పందిస్తూ.. ‘‘నేను బ్రాహ్మణ పాఠశాలలో చదివాను. చిన్నప్పటి నుంచే రామాయణ, మహాభారత గాథల గురించి తెలుసుకుంటూ వాటి మధ్యే పెరిగాను. ఆ కథలు, అందులోని విలువలన్నీ నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చారు. కేవలం మతపరమైన కోణంలోనే కాకుండా, రామాయణంలోని నీతి, నిబద్ధత ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమా కోసం రెహమాన్ మరొక ఆస్కార్ విజేత, హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మెర్‌తో కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ‘‘నేను ముస్లింని, హన్స్ జిమ్మెర్ (Hans Zimmer) యూదు మతస్థుడు, ఈ కథ హిందువులది. కానీ ఈ సినిమా భారత్ తరపున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ మేం పంచుతున్న ప్రేమ’’ అని రెహమాన్ అద్భుతంగా చెప్పుకొచ్చారు. మనసులో ఎలాంటి సంకుచిత భావాలు లేకుండా పనిచేసినప్పుడే.. మనం ఒక గొప్ప కళాఖండాన్ని సృష్టించగలమని ఆయన నొక్కి వక్కాణించారు. వాస్తవానికి రెహమాన్ మద్రాస్‌లోని హిందూ ఫ్యామిలీలోనే జన్మించారు. అతని ఒరిజినల్ పేరు దిలీప్ కుమార్ రాజగోపాల. 1989లో ఆయన ఇస్లామ్‌లోకి కన్వర్ట్ అయ్యారు.
Also Read- Euphoria Trailer: గుణశేఖర్ ‘యుఫోరియా’ మూవీ ట్రైలర్.. సమాజానికి ఈ సినిమా అవసరం.. డోంట్ మిస్!
నాలుగు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో
నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘రామాయణ’ విషయానికి వస్తే.. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే హనుమంతుడిగా సన్నీ డియోల్ అలరించనున్నారు. దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో.. రెండు భాగాలుగా నితేశ్ తివారీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ‘రామాయణ’ గురించి రెహమాన్ చెబుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై.. అనౌన్స్‌మెంట్ నుంచి ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి త్వరలోనే అప్డేట్స్ రానున్నాయి. ఏఆర్ రెహమాన్ తెలుగులో ‘పెద్ది’ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ రికార్డులను క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

