Alia Bhatt: రెండు రోజులుగా బాలీవుడ్‌లోనే కాకుండా అంతటా బాగా వినిపిస్తున్న విషయం ఆలియా భట్ నూతన గృహం గురించే. దాదాపు 250 కోట్లతో ఓ భవనం నిర్మిస్తున్నట్లుగా, ఆ భవనానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అత్యాధునిక సదుపాయాలతో ఆలియాభట్ – రణ్‌బీర్ కపూర్ (Alia Bhatt and Ranbir Kapoor) జంట నూతన గృహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా ఉంది. ఆ భవనాన్ని డ్రోన్ కెమెరాతో షూట్ చేసి మరీ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో.. ఆలియా భట్ తీవ్ర అసహనానికి గురైంది. ఆ వీడియోని తీసి, సోషల్ మీడియాలో పెట్టిన వారిపై ఫైర్ అవుతూ ఓ పోస్ట్ చేసింది. ఇప్పుడా పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.
‘‘ముంబై వంటి నగరంలో జనాలు ఉండటానికి స్థలం పరిమితంగా ఉంటుందని నాకు తెలుసు. కొన్ని సార్లు మన కిటీకీ నుంచి చూస్తే పక్క ఇంట్లో ఏం జరుగుతుందో కనిపిస్తుంది. అలా అని.. ఆ ప్రైవేట్ ఇళ్లను వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో పెట్టే హక్కు ఎవరికీ లేదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మా ఇంటిని.. మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో, లేదా ఇతర ప్లాట్‌పామ్‌లలో ఎలా ఉపయోగిస్తారు? ఇది కచ్చితంగా వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే. ఇది భద్రతా పరమైన సమస్య. అనుమతి లేకుండా ఒకరి వ్యక్తిగత స్థలాన్ని చిత్రీకరించడం, లేదంటే ఫొటోలు తీయడమనేది ‘కంటెంట్’ కాదు.. అది ఉల్లంఘన. ఇలాంటివి ఎప్పుడూ సాధారణ విషయాలుగా మారిపోకూడదు’’ అని ఆలియా భట్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. మీడియా సంస్థలు, అభిమానులు ఆ వీడియోలను షేర్ చేస్తూ, ప్రచారం చేయవద్దని ఆమె కోరింది.
ఆలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆలియా భట్, వివాహానంతరం కూడా సినిమాలు చేస్తున్నారు. ఒక పాపకు జన్మనిచ్చిన ఆమె, ఆ పాప బాగోగులు చూసుకుంటూనే.. తన వరకు వచ్చిన మంచి పాత్రలను చేస్తున్నారు. ఆలియాభట్ – రణ్‌బీర్ కపూర్ ఓ విలాసవంతమైన భవనాన్ని ఏర్పాటు చేసుకుని, అక్కడకు మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లోపు ఆ ఇంటిని పూర్తిగా వీడియో తీసి నెట్‌లో పెట్టేశారు. ఇది తప్పని, ఇతర ఇళ్లలోని సమాచారాన్ని, ఆ ఇంటి విషయాలను కంటెంట్‌గా ఉపయోగించుకుని, సొమ్ము చేసుకోవాలనుకోవడం వారి వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే అంటూ.. సోషల్ మీడియాలో ఆలియా ఫైర్ అయింది. ఈ విషయంలో పలువురు నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				