Akhanda 2: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam) చిత్రం విడుదల చివరి నిమిషంలో వాయిదా పడటం టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఈ ఆలస్యానికి గల కారణాలు, ముఖ్యంగా న్యాయపరమైన అంశాలు రెండు రోజులుగా వార్తల్లో ప్రముఖంగా నిలిచాయి. అయితే, తాజాగా ఆ సమస్య ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నా, సినిమా విడుదలకు మాత్రం ఇప్పుడు మరో కీలక సమస్య బ్రేక్ వేసినట్టుగా సమాచారం. ‘అఖండ 2: తాండవం’ ఆగిపోవడానికి ప్రధాన కారణం.. 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు ఈరోస్ ఇంటర్నేషనల్‌కు ఇవ్వాల్సిన పాత బకాయిలకు సంబంధించిన వివాదమే. ఈ విషయంపై ఈరోస్ ఇంటర్నేషనల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, కోర్టు సినిమా విడుదలను నిలిపివేసింది. ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌తో ఉన్న బకాయిల సమస్యను పరిష్కరించుకున్నట్లు, న్యాయపరమైన చిక్కులు దాదాపుగా తొలగిపోయినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ-బోయపాటి కాంబోపై ఉన్న అంచనాల దృష్ట్యా, ఈ సమస్య పరిష్కారం అవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఈ ఉపశమనం ఎక్కువ సేపు నిలవలేదు.
Also Read- Annagaru Vostaru: కలయ, గోలయ్య, జై బాలయ్య.. ‘అలాపిక్కే ఉమ్మక్’ లిరికల్ సాంగ్ వచ్చేసింది
డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్‌తో కొత్త చిక్కు
న్యాయపరమైన అడ్డంకులు తొలిగిపోయినప్పటికీ, ఇప్పుడు సినిమా హక్కులు సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి సరికొత్త సమస్య తలెత్తింది. చివరి నిమిషంలో సినిమా వాయిదా పడటం వల్ల అటు ఓవర్సీస్‌లోనూ, ఇటు దేశీయంగానూ (పాన్ ఇండియా వైడ్‌గా) డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. థియేటర్ అడ్వాన్సులు, బుకింగ్స్, ప్రచార ఖర్చులు, ఓవర్సీస్ పంపిణీకి సంబంధించిన ఇతరత్రా ఖర్చులు వాయిదా కారణంగా వృథా అయ్యాయి. దీంతో, ఈ భారీ నష్టాన్ని నిర్మాతలే భరించాలని, లేదంటే నష్టపరిహారం చెల్లించాలని డిస్ట్రిబ్యూటర్లు పట్టుబడుతున్నట్టుగా సమాచారం. ఈ విషయంలో వారితో చర్చలు సజావుగా సాగకపోవడంతో, ‘అఖండ 2’ కొత్త విడుదల తేదీని ప్రకటించడంలో ఆలస్యం జరుగుతోంది.
చర్చల్లో టాలీవుడ్ పెద్దలు
పరిశ్రమలో నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రస్తుతం టాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నిర్మాతలు, హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్న చర్చల్లో పెద్దలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. నష్టాన్ని అంచనా వేసి, ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నాయి. ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చి, ఆర్థికపరమైన సమస్యలు సమసిపోతేనే, నిర్మాతలు తక్షణమే ‘అఖండ 2: తాండవం’ కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు. చూద్దాం మరి అది ఎప్పటికి జరుగుతుందో? బాలకృష్ణ-బోయపాటి కాంబోపై భారీగా ఉన్న అంచనాల దృష్ట్యా, ట్రేడ్ పండితులు కూడా ఈ సమస్య త్వరగా పరిష్కారమై, సినిమా థియేటర్లలోకి రావాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ కొత్త ఆర్థిక వివాదం కారణంగా అభిమానుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

