Sadaa Emotional: ‘జయం’ ఫేమ్ సదా (Heroine Sadaa) తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఆమె భోరుభోరున ఏడుస్తుండటం గమనించవచ్చు. ఎవరైనా ఆమె మాట్లాడే భాష తెలియని వారు కనుక వీడియో చూస్తే.. ఆమెకు ఏదో అయిపోయిందని, ఎవరో ఆమెను ఇబ్బంది పెట్టి ఉంటారని, అందుకే అలా ఏడుస్తుందని అనుకుంటారు. కానీ ఆమె భావోద్వేగానికి లోనైంది తన కోసం కాదు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలపై (Stray Dogs in Delhi) సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పుపై అలా రియాక్ట్ అయింది. ఇప్పటికే సెలబ్రిటీలెందరో ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అయిన సదా.. ఈ తీర్పుతో మనస్తాపానికి గురైంది. ఇదేం తీర్పు.. ఇప్పుడసలు నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు, ఈ తీర్పు నన్ను చంపేసినంత ఫీలింగ్ ఇస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read- People Media Factory: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతపై ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఫైర్
ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఒక్క రేబిస్ కేసు వచ్చిందని.. దాదాపు 3 లక్షల కుక్కల్ని సిటీ నుంచి తరలిస్తారు.. లేదంటే చంపేస్తారు. ప్రభుత్వం కుక్కల కోసం 8 వారాల్లో షెల్టర్స్ రెడీ చేయాలని తీర్పు ఇచ్చారు. అసలు ఎక్కడ, ఎలా షెల్టర్స్ సిద్ధం చేస్తారు? అది జరగని పని. అన్ని కుక్కలకు ఆశ్రయం కల్పించడం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి, ఫైనల్‌గా వాటిని చంపేస్తారు. నేను ఒక్కటే అడగాలని అనుకుంటున్నాను.. మున్సిపాలిటీలు, ప్రభుత్వం.. వాటికి వ్యాక్సిన్ వేయకుండా ఇప్పటి వరకు ఏం చేసింది? యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్‌కు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఉండుంటే.. ఇప్పుడీ పరిస్థితి దాపురించేది కాదు. జంతు ప్రేమికులు, ఎన్జీవోలు తమ పరిధిలో ఉన్న కుక్కలు, పిల్లుల సంఖ్యను నియంత్రించడానికి శక్తిమేర ప్రయత్నిస్తున్నారు. అందుకు మేమే ఇస్తున్నాం డబ్బులు. వాటికి ఆరోగ్యం విషయంలో కూడా మేమే, మా సొంత డబ్బుతో చికిత్స చేయిస్తున్నాం. వాటి కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. ఇకపై వీధుల్లో కుక్కలు ఉండకూడదన్న తీర్పు విన్నప్పటి నుంచి మనసు ముక్కలవుతోంది. అసలు నాకేం చేయాలో కూడా తెలియడం లేదు. నిజం చెప్పాలంటే లోలోపలే చచ్చిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. దీనిపై ఎలా పోరాడాలి? ఎక్కడ నిరసన తెలపాలి? ఎలా నిరసన తెలియజేయాలి? అనేది నాకు తెలియడం లేదు. వీధి కుక్కలపై ఈ తీర్పు కరెక్ట్ కాదు. మన దేశాన్ని చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పును వెంటనే వెనక్కు తీసుకోవాలని ప్రాధేయపడుతున్నాను’’ అంటూ భోరుభోరున ఏడ్చేసింది సదా.
Also Read- Stray Dogs Row: సుప్రీంకోర్టు బయట కుక్కల పంచాయితీ.. డాగ్ లవర్ చెంప చెల్లుమనిపించిన లాయర్!
వాస్తవానికి ఈ తీర్పు బాధించేదే అయినా, ఈ మధ్య కాలంలో పసిపిల్లలు, వృద్దులు కనబడితే వీధి కుక్కలు ఏ విధంగా దాడి చేస్తున్నాయో అంతా చూస్తూనే ఉన్నారు. అలాగే కుక్క కాటు కారణంగా వచ్చే రేబిస్ వ్యాధితో చనిపోయే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుంది. అందుకే ఇకపై వీధుల్లో కుక్కలు కనిపించకూడదని, 8 వారాల్లోగా వాటికి షెల్టర్లు సిద్ధం చేసి, అక్కడకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుకు ఎవరైనా అడ్డు చెప్పినా, అడ్డుకోవాలని చూసినా, తీవ్ర పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. అయినా కూడా సెలబ్రిటీలు కొందరు ఈ తీర్పును వ్యతిరేకిస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆ సెలబ్రిటీలపై ఫైర్ అవుతున్నారు. ‘మీకేం తెలుసు.. మీరు ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టరు, కార్లలో తిరుగుతారు.. సామాన్యుల్లా వీధుల్లో తిరిగి చూడండి’ అంటూ కామెంట్స్ చేస్తుంటే.. కొందరు నెటిజన్లు, డాగ్ లవర్స్ సెలబ్రిటీలకు సపోర్టివ్‌గా నిలుస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు